టీమిండియా స్టార్ పేసర్, యార్కర్ల కింగ్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 150 వికెట్ల మైలురాయి అందుకున్న భారత బౌలర్‌గా, రెండో ఆసియా ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో నిప్పులు చెరిగిన బుమ్రా.. 6 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించాడు.
ఈ మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ వికెట్ తీయడం ద్వారా 150 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. 34 టెస్ట్‌ల్లో 150 వికెట్లు పడగొట్టి అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన తొలి భారత బౌలర్‌గా.. రెండో ఆసియా క్రికెటర్‌గా నిలిచాడు. 27 మ్యాచ్‌ల్లో పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ 150 వికెట్లు పడగొట్టి బుమ్రా కన్నా ముందున్నాడు. బుమ్రా తర్వాత ఇమ్రాన్ ఖాన్ 37, షోయబ్ అక్తర్ 37 మ్యాచ్‌ల్లో 150 వికెట్ల మైలు రాయి అందుకున్నారు.

ఇక 150 వికెట్ల పడగొట్టేందుకు బుమ్రా మొత్తం 6781 బంతులు వేసాడు. బుమ్రా తర్వాత ఉమేశ్ యాదవ్ 7661, మహమ్మద్ షమీ 7755, కపిల్ దేవ్ 8378, అశ్విన్ 8380 బంతులేసి ఈ ఫీట్ సాధించారు. టెస్ట్‌ల్లో బుమ్రాకు ఐదు వికెట్ల ఘనత అందుకోవడం 10వ సారి. సఫారీ గడ్డపై మూడు సార్లు, వెస్టిండ్ గడ్డపై 2 సార్లు, ఇంగ్లండ్ గడ్డపై 2 సార్లు, భారత గడ్డపై రెండు సార్లు.. ఆసీస్ గడ్డపై 2 సార్లు బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
స్పిన్‌కు అనుకూలంగా ఉండే భారత గడ్డపై.. బ్యాటింగ్‌కు అడ్వాంటేజ్‌గా ఉన్న పిచ్‌పై బజ్‌బాల్ గేమ్‌తో దూకుడుగా ఆడే ఇంగ్లండ్‌తో బుమ్రా ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు. తద్వారా తాను అసాధారణ బౌలరననే విషయాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో బుమ్రా ఇన్‌స్వింగర్, ఔట్‌స్వింగర్స్‌తో పాటు బుల్టెట్ యార్కర్లతో ప్రత్యర్థిని ముప్పు తిప్పలు పెట్టాడు. గంటకు 140 కిలోమీటర్ల వేగంతో నిలకడగా బంతులు సంధిస్తూ బౌలింగ్‌లో వేరియేషన్స్ చూపించడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు అయోమయానికి గురయ్యారు. బుమ్రా బుల్లెట్ యార్కర్‌కు ఓలీపోప్ క్లీన్ బౌల్డ్ కాగా.. స్టన్నింగ్ స్వింగర్లకు జోరూట్, జానీ బెయిర్ స్టో టామ్ హార్ట్‌లీ క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగారు.
స్టన్నింగ్ డెలివరీకి బెన్ స్టోక్స్ క్లీన్ బౌల్డ్ కాగా.. జేమ్స్ అండర్సన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. బుమ్రా సిక్సర్‌తో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 55.3 ఓవర్లలో 253 పరుగులకు కుప్పకూలింది. జాక్ క్రాలీ(78 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 76) ఒక్కడే హాఫ్ సెంచరీతో సత్తా చాటగా.. బెన్ స్టోక్స్(47) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.
భారత బౌలర్లలో బుమ్రా(6/45) సిక్సర్ కొట్టగా.. కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు తీసాడు. అక్షర్ పటేల్‌కు ఓ వికెట్ దక్కింది. అంతకు ముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్స్‌లతో 209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్(3/47), షోయబ్ బషీర్(3/138), రెహాన్ అహ్మద్(3/65) మూడేసి వికెట్లు తీసాడు. టామ్ హార్ట్‌లీకి ఓ వికెట్ దక్కింది. భారత్‌కు 143 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.