టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చరిత్ర సృష్టించాడు. సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో (5/83) ఐదు వికెట్లు పడగొట్టడం ద్వారా ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో అతను పాకిస్థాన్ దిగ్గజ పేసర్ వసీమ్ అక్రమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
సెనా దేశాల్లో వసీం అక్రమ్ 146 వికెట్లు తీసాడు. సెనా దేశాల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆసియా బౌలర్ల జాబితాలో బుమ్రా, వసీమ్ అక్రమ్ తర్వాత అనిల్ కుంబ్లే(141), ఇషాంత్ శర్మ(130)లు ఉన్నారు. ఆస్ట్రేలియాపై 12 మ్యాచ్‌ల్లో 64 వికెట్లు తీసిన బుమ్రా.. ఇంగ్లండ్‌పై 10 మ్యాచ్‌ల్లో 42, న్యూజిలాండ్‌పై 2 మ్యాచ్‌ల్లో 6, సౌతాఫ్రికాపై 8 మ్యాచ్‌ల్లో 38 వికెట్లు పడగొట్టాడు.

విదేశీ గడ్డపై అత్యధిక సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్న బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డ్‌ను బుమ్రా సమం చేశారు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు. ఓవరాల్‌గా బుమ్రా టెస్ట్‌ల్లో 210 వికెట్లు తీసాడు. ఇందులో 14 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నాడు.
జస్‌ప్రీత్ బుమ్రా ధాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దాంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. ఓలీ పోప్(106) సెంచరీతో రాణించగా.. హ్యారీ బ్రూక్(99) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. జేమీ స్మిత్(40) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/83) తోపాటు ప్రసిద్ కృష్ణ(3/128) మూడు వికెట్లు పడగొట్టాడు. మహమ్మద్ సిరాజ్(2/122) రెండు వికెట్లు తీసాడు. చెత్త ఫీల్డింగ్‌తో టీమిండియా భారీ ఆధిక్యాన్ని అందుకోలేకపోయింది. భారత ఆటగాళ్లు దాదాపు ఐదు క్యాచ్‌లు నేలపాలు చేశారు. బుమ్రా వేసిన నోబాల్‌తో బ్రూక్ డకౌటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్.. మొదటి ఇన్నింగ్స్‌లో 471 పరుగులకు ఆలౌటైంది. రిషభ్ పంత్(178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 134), శుభ్‌మన్ గిల్(227 బంతుల్లో 19 ఫోర్లు, సిక్స్‌తో 147), యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101) సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్(4/86), బెన్ స్టోక్స్(4/66) నాలుగేసి వికెట్లు తీయగా.. బ్రైడన్ కార్స్ ఓ వికెట్ పడగొట్టాడు.