
అసలేం జరిగిందంటే..?
రెండో రోజు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా.. 34వ ఓవర్‌ను ఉమేశ్ యాదవ్ బౌలింగ్ చేశాడు. ఐదో బంతిని నోబాల్‌గా సంధించాడు. దాంతో మరోసారి ఐదో బంతిని వేసేందుకు ఉమేశ్ యాదవ్ సిద్దమవుతుండగా.. జార్వో అనూహ్యంగా మైదానంలోకి దూసుకొచ్చాడు. ఉమేశ్ యాదవ్ పక్క నుంచే రనప్ చేస్తూ బౌలింగ్ చేశాడు. ఈ క్రమంలో బ్యాలెన్స్ కోల్పోయిన అతను నాన్ స్ట్రైకర్ బెయిర్ స్టోను ఢీకొట్టాడు. ఇక జ్వారో రనప్‌ను చూసి ఉమేశ్ యాదవ్ పక్కకు తప్పుకోవడం గమనార్హం. వెంటనే మైదానా సెక్యూరిటీ అతన్ని బయటకు తీసుకెళ్లాడు. భారత్ తరఫున తాను బౌలింగ్ చేస్తానని జ్వారో వాదించడం విశేషం.

బ్యాటింగ్ చేస్తానంటూ..
టీమిండియా తరఫున జార్వో ఆడేందుకు ఇలా మైదానంలోకి రావడం ఇది వరుసగా మూడోసారి. లీడ్స్ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో రోహిత్ శర్మ ఔటైన తర్వాత కోహ్లీకి బదులుగా బ్యాటింగ్ చేస్తానని జ్వారో క్రీజులోకి వచ్చాడు. టీమిండియా జెర్సీ ధరించి ఉండటం.. అచ్చం బ్యాట్స్‌మన్ తరహాలో హెల్మెట్, ఫ్యాడ్స్‌ని కూడా వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ సిబ్బంది ఏమరపాటులో ఉండిపోయారు. కానీ.. అతను భారత బ్యాట్స్‌మన్ కాదు.. జార్వో అని గుర్తించిన ఫీల్డ్ అంపైర్లు.. సెక్యూరిటీ సిబ్బందిని అలెర్ట్ చేశారు. దాంతో.. జార్వోని క్రీజు నుంచి మైదానం వెలుపలికి సెక్యూరిటీ సిబ్బంది ఈడ్చి పారేశారు.

టీమిండియా ప్లేయర్‌నంటూ..
ఇక లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో భారత బౌలర్లు ఇంగ్లండ్ వికెట్ పడగొట్టేందుకు శ్రమిస్తున్న వేళ.. భారత్ జట్టు జెర్సీ ధరించి మైదానంలోకి వచ్చిన జార్వో.. బౌలింగ్ చేసేందుకు కూడా రెడీ అయ్యాడు. ఈ క్రమంలో సెక్యూరిటీ సిబ్బంది అతన్ని అడ్డుకోగా.. జెర్సీపై ఉన్న బీసీసీఐ లోగోని వారికి చూపించిన జార్వో.. తాను భారత క్రికెటర్‌ని అంటూ వారితో వాదించాడు. కానీ.. అతన్ని అప్పట్లో సెక్యూరిటీ సిబ్బంది మైదానం వెలుపలికి బలవంతంగా తీసుకెళ్లారు. లార్డ్స్‌లో జార్వో వాదన విన్న సిరాజ్ మైదానంలోనే పడిపడి నవ్వాడు. కోహ్లీ.. అతని భాదేంటని ప్రశ్నించగా.. టీమిండియా తరఫున ఆడుతాడంటా! అని నవ్వుతూ చెప్పాడు.

లీడ్స్‌లో నిషేధం..
మైదానంలోకి దూసొకొచ్చి హడావుడి చేసి, భద్రతా నియమాలను ఉల్లంఘించిన జ్వారో 69ను హెడింగ్లే మైదానం నుంచి జీవిత కాలం నిషేధించారు. భారీ జరిమానా సైతం విధించారు. లీడ్స్ టెస్టులో పిచ్ వద్దకు వెళ్లడంతో యార్క్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ అతనిపై కఠిన చర్యలు తీసుకుంది. భద్రతా నియమావళి ఉల్లంఘించాడని, అతన్ని లీడ్స్ గ్యాలరీకి అనుమతించబోమని స్పష్టం చేసింది. 'హెడింగ్లే నుంచి డేనియెల్ జార్విస్‌ను జీవితకాలం నిషేధిస్తున్నాం. మేం అతడిపై భారీ జరిమానా విధించబోతున్నాం' అని యార్క్‌షైర్ సీసీసీ అధికార ప్రతినిధి తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏం చేయబోతున్నారని ప్రశ్నించగా.. 'గతంలో ఇలాంటి వారిని అడ్డుకొనేందుకు ప్రత్యేకంగా సిబ్బంది ఉండేవారు' అని బదులిచ్చారు.
ఇంగ్లండ్ భయపడింది..
మైదానంలో తన హడావుడితో ఫేమస్‌గా మారిన జ్వారోను క్రిక్ ట్రాకర్ ఇటీవల ఇంటర్వ్యూ చేయగా.. ఇంగ్లండ్ తనకు భయపడి నిషేధం విధించిందని తెలిపాడు. భారత్‌పై ఉన్న అభిమానంతోనే ఇలా చేస్తున్నానని చెప్పాడు. 'స్వతహాగా నేను టీమిండియాకు వీరాభిమానిని. లార్డ్స్ టెస్టు సమయంలో భారత ఆటగాళ్లు మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో బిజీగా ఉన్నారు. ఇంగ్లండ్ జట్టుతో పోలిస్తే.. టీమిండియా ఆటగాళ్లు అభిమానులతో ఎక్కువగా ఇంటరాక్ట్ అవుతారని తెలసుకున్నా. వారితో మాట్లాడే అవకాశం రాకపోవడంతో ఈ దారిని ఎంచుకున్నా. ఈ నేపథ్యంలోనే లార్డ్స్ టెస్టులో టీమిండియా జెర్సీ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాను. ఒక విధంగా ఫ్రాంక్ చేసే అవకాశం వచ్చిందని భావించా. టీమిండియా ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం మాత్రం రాలేదు. అందుకే మూడో టెస్టులో ఏకంగా బ్యాట్, ప్యాడ్స్‌తో మైదానంలోకి వచ్చేశా అని తెలిపాడు. నా బ్యాటింగ్‌కు భయపడి ఇంగ్లండ్ జట్టు నా పై జీవితకాల నిషేధం విధించిందేమో(నవ్వుతూ). అయినా మరోసారి ఇలా చేయకపోవచ్చు.'అని చెప్పాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 61.3 ఓవర్లలో 191 పరుగుల వద్ద ఆలౌటైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (96 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దుల్ ఠాకూర్ (36 బంతుల్లో 57; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. రాబిన్సన్‌కు 3 వికెట్లు దక్కాయి. షమీ, ఇషాంత్‌ల స్థానాల్లో వచ్చిన శార్దుల్, ఉమేశ్ తమ ఎంపికకు న్యాయం చేశారు. తొలి ఇన్నింగ్స్‌ను ఉత్సాహంగా ప్రారంభించిన ఇంగ్లండ్‌పై బుమ్రా (2/15) నిప్పులు చెరిగాడు. బర్న్స్ (5)ను బౌల్డ్ చేశాడు. హమీద్ (0)ను కీపర్ పంత్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఉమేశ్ అత్యంత కీలకమైన సెంచరీల మాస్టర్, కెప్టెన్ రూట్ (21)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు.
53/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలాన్ (31), ఒవర్టన్ (1 )వికెట్లను కోల్పోయింది.


Click it and Unblock the Notifications












