IND vs ENG Womens Test: భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. మహిళల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. సొంతగడ్డపై ఇంగ్లండ్ మహిళల టీమ్‌తో జరిగిన ఏకైక టెస్ట్‌లో సమష్టిగా చెలరేగిన టీమిండియా 347 పరుగుల భారీ తేడాతో గెలిచింది.
479 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. దీప్తి శర్మ(4/32), పూజా వస్త్రాకర్(3/23), రాజేశ్వరి గైక్వాడ్(2/20) ధాటికి 131 పరుగులకే కుప్పకూలింది. ఒక్క సెషన్‌లోనే ఇంగ్లండ్ ఆలౌటవ్వడం గమనార్హం. ఇలా ఒక్క సెషన్‌లోనే ప్రత్యర్థిని ఆలౌట్ చేసిన జట్టుగా భారత్ రికార్డ్ కెక్కింది. ఇంగ్లండ్ బ్లాటర్లలో చార్లీ డీన్(33 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన హర్మన్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో 428 పరుగుల భారీ స్కోర్ చేసింది. అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను చెడుగుడు ఆడింది. అరంగేట్ర ప్లేయర్ సతీష్ శుభా(69)తో పాటు జెమీమా రోడ్రిగ్స్(68), యస్తికా భాటియా(66), దీప్తి శర్మ(67) హాఫ్ సెంచరీలతో రాణించారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. దీప్తి శర్మ(5/7) ధాటికి 136 పరుగులకే కుప్పకూలింది. నాట్ సీవర్ బ్రంట్(59) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించింది. దాంతో టీమిండియాకు 392 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. అనంతరం భారత్ రెండో ఇన్నింగ్స్ 186/6 డిక్లేర్ చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్(44 నాటౌట్) రాణించింది.
దాంతో ఇంగ్లండ్ ముందు 479 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. మరోసారి దీప్తి శర్మ చెలరేగడంతో ఇంగ్లండ్ ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో రాణించిన దీప్తి శర్మకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. గత 17 ఏళ్లుగా టెస్ట్ క్రికెట్‌లో భారత మహిళా జట్టు ఆధిపత్యం చెలాయిస్తోంది. ఓటమెరుగని జట్టుగా కొనసాగుతోంది.