ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌కు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో చివరి టెస్ట్‌కు తుది జట్టులో టీమిండియా మేనేజ్‌మెంట్ పలు మార్పులు చేసే అవకాశం ఉంది.
విరామం లేకుండా ఆడుతున్న కెప్టెన్ రోహిత్ శర్మకు చివరి టెస్ట్ నుంచి విశ్రాంతి కల్పించే అవకాశం ఉంది. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనుంది. ఇప్పటికే వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా రెండో టెస్ట్ నుంచి మహమ్మద్ సిరాజ్, నాలుగో టెస్ట్ నుంచి జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతినిచ్చారు. తాజాగా రోహిత్ శర్మకు రెస్ట్ ఇవ్వనున్నారు.

ఇక నాలుగో టెస్ట్‌కు దూరంగా ఉన్న జస్‌ప్రీత్ బుమ్రా చివరి టెస్ట్ కూడా ఆడే అవకాశాలు లేవు. దాంతో రోహిత్ శర్మను తప్పిస్తే కెప్టెన్ ఎవరా? అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే కెరీర్‌లో 100 టెస్ట్ ఆడనున్న రవిచంద్రన్ అశ్విన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించి అతన్ని సముచితంగా గౌరవించాలని బీసీసీఐ పెద్దలతో పాటు టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయించినట్లు నేషనల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే సునీల్ గవాస్కర్, రవి శాస్త్రి.. చివరి టెస్ట్‌లో అశ్విన్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించాలని రోహిత్ శర్మకు సూచించారు. ఇక రోహిత్ శర్మ స్థానంలో యువ ప్లేయర్ దేవదత్ పడిక్కల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. రోహిత్ శర్మ దూరమైతే.. దేవదత్ పడిక్కల్, జైస్వాల్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ మిడిలార్డర్ బాధ్యతలు మోయనున్నారు.
కేఎల్ రాహుల్ అందుబాటులోకి వస్తే రజత్ పటీదార్‌పై వేటు పడే అవకాశం ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ కొనసాగనుండగా.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నాడు. కుల్దీప్‌కు రెస్ట్ ఇస్తే అక్షర్ పటేల్‌కు చోటు దక్కుతుంది. పేసర్లుగా మహమ్మద్ సిరాజ్‌తో పాటు యువ పేసర్ ఆకాశ్ దీప్ కొనసాగనున్నాడు.
భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య చివరి టెస్ట్ ధర్మశాల వేదికగా మార్చి 7 నుంచి ప్రారంభం కానుంది. ధర్మశాల పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉన్న నేపథ్యంలో టీమిండియా మూడో పేసర్‌తో బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. బుమ్రా లేకుండా మూడో పేసర్‌ను ఆడించాల్సి వస్తే ముఖేష్ కుమార్ బరిలోకి దిగుతాడు.