ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. యశస్వి జైస్వాల్(74 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80), కేఎల్ రాహుల్(123 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 86), రవీంద్ర జడేజా(155 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 81 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో సత్తా చాటడంతో రెండో రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది.
దూకుడుగా బ్యాటింగ్ చేసిన భారత బ్యాటర్లు స్కోర్ బోర్డును పరుగెత్తించారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 110 ఓవర్లలో 7 వికెట్లకు 421 పరుగులు చేసింది. తెలుగు తేజం కేఎస్ భరత్(81 బంతుల్లో 3 ఫోర్లతో 41) తృటిలో హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లలో టామ్ హార్ట్‌లీ, జోరూట్ రెండేసి వికెట్లు తీయగా.. జాక్ లీచ్, రెహాన్ అహ్మద్ తలో వికెట్ పడగొట్టారు.

ప్రస్తుతం భారత్ ఆధిక్యం 175 పరుగులకు చేరింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.
జైస్వాల్ సెంచరీ మిస్..
119/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. మరో 4 పరుగుల వ్యవధిలోనే ఓపెనర్ యశస్వి జైస్వాల్ వికెట్‌ను కోల్పోయింది. జోరూట్ బౌలింగ్‌లో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో యశస్వి రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేరాడు. అనవసర షాట్‌తో సెంచరీ చేసుకునే అవకాశాన్ని చేజార్చుకున్నాడు.
క్రీజులోకి కేఎల్ రాహుల్ రాగా.. ఆచితూచి ఆడిన శుభ్‌మన్ గిల్‌ను హార్ట్‌లీ క్యాచ్ ఔట్ చేశాడు. గిల్ సైతం భారీ షాట్ ప్రయత్నంలోనే క్యాచ్ ఔటయ్యాడు. 40 పరుగుల వ్యవధిలోనే టీమిండియా రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్‌తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును ఆదుకున్నాడు.
రాణించిన రాహుల్..
ఈ ఇద్దరూ దూకుడుగా ఆడుతూ జట్టు స్కోర్‌ను పరుగెత్తించారు. 72 బంతుల్లో రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. భారత్ 222/3 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ప్రారంభంలోనే టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. నిలకడగా ఆడుతున్న శ్రేయస్ అయ్యర్(35) రెహాన్ అహ్మద్ పెవిలియన్ చేర్చాడు.
భారీ సిక్సర్ బాదే ప్రయత్నంలో అయ్యర్ క్యాచ్ ఔటయ్యాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 64 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. రవీంద్ర జడేజా బ్యాటింగ్‌కు రాగా.. రాహుల్ తన జోరును కొనసాగించాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. జడేజా సైతం తన మార్క్ బ్యాటింగ్‌తో చెలరేగడంతో భారత్ స్కోర్ బోర్డు వేగంగా కదిలింది.
చెలరేగిన జడేజా..
ఇక సెంచరీకి చేరువైన కేఎల్ రాహుల్‌ను హార్ట్‌లీ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. రాహుల్ సైతం భారీ షాట్ ఆడే ప్రయత్నంలోనే ఔటయ్యాడు. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 65 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన కేఎస్ భరత్ సాయంతో జడేజా రెండో సెషన్‌ను ముగించాడు. 309/5 స్కోర్‌తో టీమిండియా టీ బ్రేక్‌కు వెళ్లింది.
మూడో సెషన్ ప్రారంభంలోనే జడేజా 84 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఇద్దరూ ఆచితూచి ఆడుతూ ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు. 68 పరుగుల భాగస్వామ్యంతో ప్రమాదకరంగా మారిన ఈ జోడీని జోరూట్ విడదీసాడు. శ్రీకర్ భరత్‌ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు.
ఆ వెంటనే రవిచంద్రన్ అశ్విన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. జడేజాతో సమయన్వయలోపంతో మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో రెండు పరుగుల వ్యవధిలోనే టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ సాయంతో జడేజా ఆచితూచి ఆడి రెండో రోజు ఆటను ముగించాడు.