
ఓవల్: రోహిత్ శర్మ(256 బంతుల్లో 127) సూపర్ సెంచరీకి చతేశ్వర్ పుజారా(127 బంతుల్లో 9 ఫోర్లతో 61) బాధ్యతాయుత హాఫ్ సెంచరీ తోడవడంతో నాలుగో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత్ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ ఇద్దరికి జతగా కేఎల్ రాహుల్(101 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 46) కూడా రాణించడంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. క్రీజులో కెప్టెన్ విరాట్ కోహ్లీ(22 బ్యాటింగ్), రవీంద్ర జడేజా(9 బ్యాటింగ్) ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్లలో రాబిన్సన్ రెండు వికెట్లు తీయగా.. అండర్సన్ ఓ వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం భారత్ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. మ్యాచ్‌పై మరింత పట్టు సాధించాలంటే భారత్ నాలుగో రోజు కూడా జోరు కనబర్చాలి. ఆతిథ్య జట్టు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాలి.
అంతకు ముందు 43/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్(46) తొలి వికెట్‌కు 83 పరుగులు జోడించి మంచి శుభారంభాన్ని అందించారు. మరోసారి సెంచరీ భాగస్వామ్యం దిశగా దూసుకెళ్తున్న ఈ జోడీని జేమ్స్ అండర్సన్ విడదీశాడు. కీపర్ క్యాచ్‌గా కేఎల్ రాహుల్(46)ను పెవిలియన్ చేర్చాడు. అయితే ఈ ఔట్ విషయంలో అంపైర్ ఔటివ్వకపోయినా.. ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ రివ్యూకెళ్లి ఫలితం సాధించాడు. దాంతో రాహుల్ 4 పరుగుల వ్యవధిలోనే హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు.
అనంతరం పుజారా క్రీజులోకి రాగా.. రోహిత్ దూకుడుగా ఆడాడు. దాంతో భారత్ 108/1తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. అనంతరం రోహిత్ శర్మ 145 బంతుల్లో 5 ఫోర్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత మరింత కమిట్ మెంట్‌తో ఆడిన రోహిత్ శర్మ.. వీలుచిక్కిన బంతిని బౌండరీకి తరలించాడు. మరో ఎండ్‌లో పుజారా సైతం సహకారం అందించడంతో ఎలాంటి ఒత్తిడి లేకుండా బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 204 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌తో రోహిత్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. మరోవైపు పుజారా హాఫ్ సెంచరీకి చేరువవ్వగా.. భారత్ 199/1తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
మూడో సెషన్‌లో రోహిత్ మరింత ధాటిగా ఆడగా.. పుజారా 103 బంతుల్లో 8 ఫోర్లతో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. 153 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని ఓలీ రాబిన్సన్ విడదీశాడు. ఓకే ఓవర్‌లో ఈ ఇద్దరిని ఔట్ చేశాడు. ముందుగా రోహిత్ శర్మను అద్భుత బంతితో క్యాచ్ ఔట్‌గా బొల్తాకొట్టించిన రాబిన్సన్.. తర్వాత పుజారాను కూడా క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి విరాట్ కోహ్లీ, రవీంద్రజడేజా రాగా.. నిలకడగా ఆడారు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. ఇక మైదానంలో బ్యాడ్ లైట్ కారణంగా అంపైర్లు మూడో రోజు ఆటను ముందుగానే ముగించారు.