తీవ్ర మనోవేదన మిగిల్చిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న టీమిండియా మరో సవాల్‌కు సిద్దమైంది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. ముందుగా ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్ జనవరి 22 నుంచి ప్రారంభం కానుంది.
ఫిబ్రవరి 6 నుంచి మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగనుంది. ఈ మెగా టోర్నీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌ను టీమిండియా సన్నాహకంగా వాడుకోనుంది. అయితే ఈ వన్డే సిరీస్‌కు ముందు టీమిండియా అభిమానులను ఓ విషయం ఆందోళనకు గురిచేస్తోంది.

గత 44 ఏళ్లుగా భారత గడ్డపై ఇంగ్లండ్ వన్డే సిరీస్ గెలవలేదు. ప్రతీ ఏడాది ఇంగ్లండ్.. భారత పర్యటనకు వస్తున్నా వన్డే సిరీస్ గెలవలేదు. ఇటీవల టీమిండియాకు వరుస పరాజయాలు ఎదురవుతున్ననేపథ్యంలో ఈ రికార్డ్ కూడా బద్దలు అవుతుందా? అనే భయం అభిమానులకు పట్టుకుంది. ముఖ్యంగా టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్.. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయి.
హెడ్ కోచ్ గంభీర్ తొలి పర్యటనలోనే మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. శ్రీలంకతో టీ20 సిరీస్ గెలిచిన టీమిండియా.. వన్డే సిరీస్ ఓడిపోయింది. 27 ఏళ్ల సుదీర్ఘ సమయం తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ ఓటమిపాలైంది. ఆ తర్వాత సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో క్లీన్ స్వీప్ అయ్యింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే సొంతగడ్డపై తొలిసారి టీమిండియా క్లీన్ స్వీప్ అవ్వగా.. న్యూజిలాండ్ ఫస్ట్ టైమ్ టెస్ట్ మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచింది.
ఆ తర్వాత ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 1-3తో కోల్పోయింది. 10 ఏళ్ల తర్వాత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని చేజార్చుకుంది. ఈ వరుస పరాజయాల నేపథ్యంలోనే ఇంగ్లండ్‌తో కూడా టెస్ట్ సిరీస్ కోల్పోతుందనే భయం అభిమానులను వెంటాడుతోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ గెలవడం టీమిండియాకు అత్యవసరం.