ఇంగ్లండ్‌తో వైజాగ్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. సోమవారం ముగిసిన ఈ మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన భారత్ 106 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఇంగ్లండ్ 69.2 ఓవర్లలో 292 పరుగులకు ఆలౌటైంది.
ఆ జట్టులో జాక్ క్రాలీ(132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్‌తో 73) ఒక్కడే హాఫ్ సెంచరీ నమోదు చేయగా.. బెన్ ఫోక్స్(69 బంతుల్లో 4 ఫోర్లు సిక్స్‌తో 36), టామ్ హార్ట్‌లీ(47 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 36) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్(3/72), జస్‌ప్రీత్ బుమ్రా(3/46) మూడేసి వికెట్లు తీయగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో హైదరాబాద్ పరాజయానికి ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన.. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో 1-1తో సమంగా నిలిచింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్ట్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా ప్రారంభం కానుంది.

ఆరంభంలోనే షాక్..
67/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను కొనసాగించిన ఇంగ్లండ్ ఆరంభంలోనే ఓవర్‌నైట్ బ్యాటర్ రెహాన్ అహ్మద్(23) వికెట్ కోల్పోయింది. అక్షర్ పటేల్ బౌలింగ్‌లో రెహాన్ అహ్మద్ ఎల్బీగా వెనుదిరిగాడు. ఆ కొద్ది సేపటికే ఓలీపోప్(23), జోరూట్(16)లను అశ్విన్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో ఇంగ్లండ్ 154 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
జాక్ క్రాలీ దూకుడు..
ఈ పరిస్థితుల్లో జాక్ క్రాలీ.. బెయిర్ స్టోతో కలిసి ధాటిగా ఆడాడు. 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను దూకుడుగా ఆడుతూ సెంచరీ దిశగా సాగాడు. అయితే అతని జోరుకు కుల్దీప్ యాదవ్ కళ్లెం వేసాడు. స్టన్నింగ్ డెలివరీతో ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. అంపైర్ ఔటివ్వకున్నా రివ్యూ తీసుకొని టీమిండియా ఈ వికెట్ సాధించింది.
ఆ మరుసటి ఓవర్‌లోనే జానీ బెయిర్ స్టోను బుమ్రా వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. బెయిర్ స్టో రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. దాంతో ఇంగ్లండ్ 194/6 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది. రెండో సెషన్ ప్రారంభమైన కాసేపటికే శ్రేయస్ అయ్యర్ స్టన్నింగ్ త్రోకు బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు. ఈ పరిస్థితుల్లో బెన్ ఫోక్స్, టామ్ హార్ట్‌లీ ఆచితూచి ఆడుతూ.. 50 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు.
బూమ్ బూమ్ బుమ్రా..
బుమ్రాను రంగంలోకి దింపిన రోహిత్.. ఆశించిన ఫలితాన్ని రాబట్టాడు. బెన్ ఫోక్స్‌ను బుమ్రా రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన షోయబ్ బషీర్(0)ను ముఖేష్ కుమార్ కీపర్ క్యాచ్‌గా వెనక్కిపంపాడు. ఆచితూచి ఆడుతున్న టామ్ హార్ట్‌లీని బుమ్రా క్లీన్ బౌల్డ్ చేసి భారత విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు.
యశస్వి డబుల్...
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 396 పరుగులకు ఆలౌటైంది. యశస్వి జైస్వాల్(209) ఒక్కడే డబుల్ సెంచరీతో రాణించాడు. అనంతరం ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 253 పరుగులకు కుప్పకూలింది. జస్‌ప్రీత్ బుమ్రా(6/45) 6 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు. దాంతో భారత్‌కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులకు ఆలౌటైంది. శుభ్‌మన్ గిల్(104) ఒక్కడే సెంచరీ సాధించగా.. అక్షర్ పటేల్(45) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో ఇంగ్లండ్ ముందు 399 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది.