
హైదరాబాద్: ఫస్ట్ టెస్ట్‌లో విజయాన్ని తృటిలో చేజార్చుకొని.. రెండో టెస్ట్‌లో థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసి ఇంగ్లండ్ గడ్డపై జోరు కనబర్చిన కోహ్లీసేన.. గత మ్యాచ్‌లో మాత్రం పేలవ ప్రదర్శనతో ఘోర పరాజయం చవిచూసింది. ఇంగ్లండ్ బౌలర్ల ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బాల్స్‌కు చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ దారుణ ఓటమికి కారణమయ్యారు. దాంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి.
ఇప్పుడు ఓవల్ వేదికగా మరో ఆసక్తికరపోరుకు రెడీ అవుతున్నాయి. విజయ ఉత్సాహంలో ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతుండగా.. దెబ్బతిన్న పులిలా గర్జించేందుకు భారత ఆటగాళ్లు సమాయత్తం అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఓవల్ మైదానంలోని రికార్డులు భారత జట్టును కలవరపెడుతున్నాయి.
ఎంతాలా అంటే గత 50 ఏళ్లుగా టీమిండియా ఈ మైదానంలో ఒక్క విజయం సాధించలేదు. ఇక గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) అయితే ఘోర పరాజయం చవి చూసింది. 2011, 2014 పర్యటనల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. ఓవల్‌లో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం. ఆ తర్వాత 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్కదాంట్లో విజయం సాధించ లేదు. చివరి మూడింటిలో చిత్తుగా ఓడి.. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల్లో డ్రా చేసుకుంది.
1936 నుంచి ఈ వేదికపై ఆడిన భారత్.. 1971లో విజయం తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక చివరి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలు చవిచూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. గత పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.
అయితే 2018 పర్యటనలో కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఈ వేదికపై సెంచరీలు చేయడం విశేషం. ఈ వేదికగా ఇప్పటి వరకు నాలుగు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. కనీసం 50 మార్క్ అందుకోలేకపోయాడు. ఇక ఓవల్ వేదికగా భారత్‌తో ఆడిన రెండు టెస్ట్‌ల్లో జోరూట్ సెంచరీ చేయడం గమనార్హం.