
పేసర్ల పుణ్యమే..
బౌలింగ్‌లోనే కాదు.. బ్యాట్స్‌మెన్ చేతులెత్తేసిన వేళ లోయరార్డర్‌లో అనూహ్య ప్రదర్శనతో బ్యాట్ ఝులిపించి విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజా ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌లో భారత్ పై చేయి సాధించిందన్నా.. ఆస్ట్రేలియా పర్యటనలో సిరీజ్ విజయాన్ని అందుకుందన్నా అది పేసర్ల పుణ్యమే.
తాజా సిరీస్‌లో లార్డ్స్ టెస్ట్‌లో ఓటమి ముగింట నిలిచిన భారత్.. బౌలర్ల అసాధారణ ప్రదర్శనతోనే గెలుపొందింది. కీలక నాలుగో టెస్ట్‌లోనూ అద్భుత విజయాన్నందుకొని 50 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. అప్పుడెప్పుడో 1971లో ఓవల్ మైదానంలో గెలిచిన భారత్ ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే విజయం సాధించింది.

బ్యాటింగ్ అనువైన్ పిచ్‌లో..
నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లిష్ జట్టు వికెట్ నష్టపోకుండా 100 పరుగులు చేసిన స్థితిలో చివరి రోజు మన బౌలర్లు చేసిన అద్భుతాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇది భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయే ప్రదర్శన అంటే అతిశయోక్తి కాదు. బ్యాటింగ్ చాలా తేలికైపోయినట్లు కనిపించిన వికెట్ మీద ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా బౌలింగ్ చేసిన తీరు అసాధారణం.
గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా పర్యటనలో సైతం మన బౌలర్లు ఇలాంటి దృఢ సంకల్పాన్నే చూపించారు. తొలి టెస్టులో ఘోర పరాభవం తర్వాత భారత్ అంత గొప్పగా పుంజుకుని సిరీస్ సాధించిందంటే అందులో బౌలర్ల పాత్ర అత్యంత కీలకం. విదేశాల్లో పరిస్థితులు జట్టుకు అంత అనుకూలంగా లేనపుడు బౌలర్లు ఇలా గొప్ప ప్రదర్శనతో మ్యాచ్‌లు మలుపు తిప్పడం భారత క్రికెట్లో చూస్తున్న గొప్ప మార్పు.

బ్యాటింగ్ సమస్యలున్నా..
ఇప్పటికీ బ్యాటింగ్‌లో భారత్‌కు సమస్యలున్నాయి. ఎన్నో ఏళ్లుగా బ్యాటింగ్ మూల స్తంభాలుగా ఉంటున్న కోహ్లీ, పుజారా, రహానే స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. బ్యాటింగ్‌లో అప్పుడప్పుడూ పతనాలు చూస్తూనే ఉన్నాం. అయినా సరే.. భారత్ గెలుస్తోందంటే.. ఓవల్‌లో మాదిరి అద్భుతాలు ఆవిష్కరిస్తోందంటే అది బౌలర్ల చలవే. ముఖ్యంగా నాలుగో టెస్టు చివరి రోజు బౌలర్లు పనితనం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. లార్డ్స్‌లో మాదిరే ఇది కూడా చరిత్రాత్మక ప్రదర్శన అనడంలో సందేహం లేదు.

157 రన్స్ తేడాతో..
ఆఖరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన టీమ్ ఇండియా నాలుగో టెస్టులో 157 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లండ్‌ను ఓడించింది. 368 పరుగుల లక్ష్య ఛేదనలో ఓవర్‌నైట్ స్కోరు 77/0తో అయిదో రోజు, సోమవారం బరిలోకి దిగినఇంగ్లండ్.. 210 పరుగులకు ఆలౌటైంది. ఉమేశ్ యాదవ్ (3/60), శార్దూల్ ఠాకూర్ (2/22), బుమ్రా (2/27), జడేజా (2/50) ఆ జట్టు పతనాన్ని శాసించారు. ఓపెనర్లు హమీద్ (63), బర్న్స్ (50) తొలి వికెట్‌కు వంద పరుగులు జోడించినా.. ఆ తర్వాత వచ్చినఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ తేలిపోయారు. రోహిత్ శర్మకు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు లభించింది. చివరి టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది.

సంక్షిప్త స్కోర్లు..
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్ (ఓలీ పోప్ 81, క్రిస్ వోక్స్ 50
భారత్ రెండో ఇన్నింగ్స్: 466 (రోహిత్ 127, పుజారా 61, శార్దూల్ 60, పంత్ 50)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 210 ఆలౌట్


Click it and Unblock the Notifications












