టీమిండియా వికెట్ కీపర్ సంజూ శాంసన్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో బుధవారం జరిగిన తొలి టీ20లో సంజూ శాంసన్(20 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 26) అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. సంజూ అద్భుతమైన ఆరంభంతో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ చెలరేగాడు.
20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో ఈ మ్యాచ్‌లో భారత్ 43 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. టీ20ల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. మెరుపు ఆరంభం అందించినా సంజూ శాంసన్‌పై కొందరు అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు.

ఎందుకంటే సంజూ శాంసన్ చేసిన 26 పరుగుల్లో 22 రన్స్ గస్ అట్కిన్సన్ బౌలింగ్‌లోనే వచ్చాయి. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు చేసిన సంజూ శాంసన్.. తొలి ఐదు బంతులను ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. అట్కిన్సన్ వేసిన రెండో ఓవర్‌లో నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో విరుచుకుపడ్డాడు.
మార్క్ వుడ్ వేసిన నాలుగో ఓవర్‌లోనూ సంజూ శాంసన్ ఒకే ఒక్క పరుగు చేశాడు. ఆర్చర్ వేసిన ఐదో ఓవర్‌లో తొలి బంతికి రెండు పరుగులు చేసిన సంజూ.. రెండో బంతికి సిక్స్ కొట్టబోయే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. మెరుగైన పేస్ బౌలింగ్ ఆడేందుకు సంజూ ఇబ్బంది పడుతున్నాడు. మెరుగ్గా బౌలింగ్ చేసిన మార్క్ వుడ్, జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో సంజూ నాలుగు పరుగులు మాత్రమే చేశాడు.
ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ అతని హేటర్స్ విమర్శలు గుప్పిస్తున్నారు. కీలక బౌలర్లు లేకపోవడంతోనే సంజూ శాంసన్.. బంగ్లాదేశ్, సౌతాఫ్రికాలపై శతకాలు సాధించాడని అభిప్రాయపడుతున్నారు. అన్‌రిచ్ నోకియా, కగిసో రబడాల లేని సౌతాఫ్రికా బౌలింగ్ లైనప్‌పై సంజూ శతకం సాధించాడని గుర్తు చేస్తున్నారు.