ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శుక్రవారం నుంచి లీడ్స్ వేదికగా జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ సిరీస్‌తోనే డబ్ల్యూటీసీ 2027 ఎడిషన్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇంగ్లండ్ చేరిన టీమిండియా సన్నాహక మ్యాచ్‌లను కూడా పూర్తి చేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో కుర్రాళ్లతో కూడిన జట్టును బీసీసీఐ ఎంపిక చేసింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలో 18 మంది సభ్యులతో కూడిన జంబో టీమ్ ఇంగ్లండ్‌లో అడుగుపెట్టింది. రిషభ్ పంత్‌కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కాయి. సాయి సుదర్శన్ తొలి సారి టీమిండియా టెస్ట్ టీమ్ పిలుపు అందుకున్నాడు.
అయితే ఈ జట్టులోకి ఇప్పుడు కొత్తగా మరో ఆటగాడు వచ్చి చేరాడని తెలుస్తోంది. హర్షిత్ రాణాను కొత్తగా జట్టులోకి తీసుకున్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఇప్పటికే జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్ రూపంలో ఐదుగురు పేసర్లు ఉన్నారు. వీరికి తోడుగా హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్లు సమాచారం. బుమ్రా ఐదు టెస్ట్‌లు ఆడలేని పరిస్థితి ఉండటంతోనే హర్షిత్ రాణాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దాంతో భారత జట్టు ఆటగాళ్ల సంఖ్య 19కి చేరింది. అయితే ఈ విషయమై బీసీసీఐ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం హర్షిత్ రాణా ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్నాడు. భారత్-ఏ జట్టు తరఫున అతను అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. భారత్-ఏ జట్టు, ఇంగ్లండ్ లయన్స్ మధ్య జరిగిన తొలి అనధికారిక టెస్ట్‌లో హర్షిత్ రాణా 99 పరుగులిచ్చి ఒకే ఒక్క వికెట్ తీసుకున్నాడు. బ్యాటింగ్‌లో 16 పరుగులు చేశాడు. హర్షిత్ రాణా.. గతేడాది ఆసీస్ పర్యటనలో టెస్ట్ క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు నాలుగు వికెట్లు తీసాడు. అతని అత్యుత్తమ ప్రదర్శన(3/48).
ఓవరాల్‌గా 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడిన రాణా.. 27.79 యావరేజ్‌తో 48 వికెట్లు తీసాడు. ఇందులో ఓ సెంచరీతో పాటు రెండు హాఫ్ సెంచరీలు కూడా ఉండటం గమనార్హం. బ్యాటింగ్ చేసే సామర్థ్యం ఉండటంతో లోయరార్డర్‌లో కీలకమవుతాడని టీమిండియా మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.