For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs ENG: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఓటమికి కారణాలు ఇవే!

ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఆధిక్యంలో వెళ్లేందుకు వచ్చిన సువర్ణవకాశాన్ని టీమిండియా చేజార్చుకుంది. లార్డ్స్ వేదికగా తీవ్ర ఉత్కంఠ రేపిన మూడో టెస్ట్‌లో 22 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. అనూహ్య మలుపులు, ఉత్కంఠతో సాగుతూ వచ్చిన మ్యాచ్‌లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియా కొంపముంచింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో టీమిండియా 170 పరుగులకే ఆలౌటైంది. టెయిలెండర్స్ జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లతో కలిసి రవీంద్ర జడేజా(61 నాటౌట్) ఒంటరిగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ మ్యాచ్‌ను టీమిండియా చేజేతులా చేజార్చుకుంది. నాలుగు అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.

1. బ్యాటింగ్ వైఫల్యం

ఈ మ్యాచ్‌లో టీమిండియా టాపర్డర్-మిడిలార్డర్ దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్‌లో పర్వలేదనిపించినా రెండో ఇన్నింగ్స్‌లో చేతులెత్తేసింది. 193 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో భారత బ్యాటర్లు జాగ్రత్తగా ఆడలేకపోయారు. యశస్వి జైస్వాల్ నిర్లక్ష్యపు షాట్ ఆడి వెనుదిరగ్గా.. శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్ ఓపికగా ఆడలేక వికెట్ పారేసుకున్నారు. నిలకడగా ఆడిన రాహుల్ కూడా ఎక్కువ సేపు క్రీజులో ఉండలేకపోయాడు. జట్టును ఆదుకుంటాడని భావించిన రిషభ్ పంత్‌ను.. జోఫ్రా ఆర్చర్ స్టన్నింగ్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే సుందర్ ఔటవ్వడం టీమిండియా పతనాన్ని శాసించింది. జడేజాకు అండగా ఒక్క బ్యాటర్ నిలిచినా.. ఒక్క 50 పరుగుల భాగస్వామ్యం నమోదైనా భారత్ విజయం సాధించేది. మ్యాచ్ అనంతరం కెప్టెన్‌ శుభ్‌మన్ గిల్ కూడా ఇదే విషయాన్ని అంగీకరించాడు.

IND vs ENG Four Reasons Why India Lost To England In The Third Test At Lord s

2. రిషభ్ పంత్ రనౌట్

భారత తొలి ఇన్నింగ్స్‌లో రిషభ్ పంత్ రనౌటవ్వడం మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. కేఎల్ రాహుల్‌తో కలిసి హాఫ్ సెంచరీ చేసిన పంత్(74).. 141 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ రాహుల్ సెంచరీ కోసం అనవసర పరుగుకు ప్రయత్నించి మూల్యం చెల్లించుకున్నాడు. పంత్ రనౌట్ కాకుండా ఉండి సెంచరీ చేసుంటే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు భారీ ఆధిక్యం దక్కేది. అప్పుడు విజయవకాశాలు మెరుగయ్యేవి. పంత్ రనౌట్ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్ అని మ్యాచ్ అనంతరం బెన్ స్టోక్స్ కూడా తెలిపాడు.

3. కొంపముంచిన ఎక్స్‌ట్రాలు..

భారత బౌలర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి మొత్తం 63 ఎక్స్‌ట్రాలు ఇచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 32 అదనపు పరుగులు సమర్పించుకున్నారు. ధ్రువ్ జురెల్ పేలవ వికెట్ కీపింగ్ కారణంగా బైస్ రూపంలో చాలా పరుగులు వచ్చాయి. పంత్ గాయపడటంతో ధ్రువ్ జురెల్ తాత్కలిక వికెట్ కీపర్‌గా బాధ్యతలు చేపట్టాడు. అతను కీపర్ తడబడ్డాడు. కీలక క్యాచ్‌లను కూడా వదిలేసాడు. ఈ అదనపు పరుగులను కట్టడి చేసుంటే ఫలితం మరోలా ఉండేది. తదుపరి మ్యాచ్‌ల్లోనైనా భారత బౌలర్లు ఎక్స్‌ట్రాలపై ఫోకస్ పెట్టాలి.

4. బంతి మార్పు

ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 80 ఓవర్ల తర్వాత కొత్త బంతిని అందుకున్న భారత్.. 10 ఓవర్ల తర్వాత బంతి ఆకారం దెబ్బతిన్నదని అంపైర్లకు ఫిర్యాదు చేసింది. బంతిని మార్చాలని కోరింది. బాల్ గేజ్‌తో పరిశీలించిన అంపైర్ మరో బంతిని ఇచ్చాడు. ఈ బంతి పాతదానికంటే దారుణంగా ఉందని భారత ఆటగాళ్లు అసహనం వ్యక్తం చేశారు. 271/7తో ఆలౌట్ దిశగా సాగిన ఇంగ్లండ్.. పాత బంతితో చక్కగా ఆడి 387 పరుగులు చేసింది. బంతిని మార్చకుండా బౌలింగ్ చేసుంటే ఇంగ్లండ్ 300 పరుగుల్లోపే ఆలౌటయ్యేది. ఈ మ్యాచ్‌లో ఎక్కువ భాగం ఆధిపత్యం చెలాయించిన భారత్.. ఆఖరి రోజు తడబడి మూల్యం చెల్లించుకుంది. జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ కూడా ఇంగ్లండ్‌కు కలిసొచ్చింది.

Story first published: Tuesday, July 15, 2025, 11:49 [IST]
Other articles published on Jul 15, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+