ఇంగ్లండ్ టెస్ట్ టీమ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌పై ఆ దేశ మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం లీడ్స్ వేదికగా ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో బెన్ స్టోక్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడాన్ని తప్పుబట్టారు. కామన్ సెన్స్ లేకుండా స్టోక్స్ బౌలింగ్ ఎంచుకున్నాడని ఘాటుగా విమర్శించారు. తీవ్రమైన ఎండ, పొడిగా ఉన్న పిచ్, స్వింగ్‌కు ఏ మాత్రం అవకాశం లేని వాతావరణం, జట్టులో పెద్దగా అనుభవం లేని బౌలర్లు ఉన్న పరిస్థితుల్లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం బెన్ స్టోక్స్ చేసిన ఘోర తప్పిదమని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, మైకేల్ ఆథర్టన్, అలిస్టర్ కుక్ అభిప్రాయపడ్డారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ తొలి రోజు ఆటలో దుమ్మురేపింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిన కండిషన్స్‌లో ఓపెనర్ యశస్వి జైస్వాల్(159 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 101), శుభ్‌మన్ గిల్(175 బంతుల్లో 16 ఫోర్లు, సిక్స్‌తో 127 బ్యాటింగ్) సెంచరీలతో చెలరేగగా.. రిషభ్ పంత్(102 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 85 ఓవర్లలో 3 వికెట్లకు 359 పరుగుల భారీ స్కోర్ చేసింది.

ఇద్దరు బ్యాటర్లు సెంచరీ.. మరో బ్యాటర్ హాఫ్ సెంచరీ చేయడంతో పిచ్ కండిషన్స్ బ్యాటింగ్‌కు ఎంత అనుకూలంగా ఉన్నాయనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఈ క్రమంలోనే స్టోక్స్ నిర్ణయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు మండిపడ్డారు. స్టోక్స్ నిర్ణయంపై మైకేల్ వాన్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. 'హెడింగ్లీ మైదానంలో తీవ్రమైన ఎండ, పొడి వాతావరణం ఉంటే మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకోవాలి. కానీ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోవడం చూసి ఆశ్చర్యపోయాను. గత రికార్డ్స్, సంప్రదాయాలు అన్ని గాలికి కొట్టుకుపోతాయి. ఎప్పుడైనా ఆ క్షణంలో ఉన్న కండిషన్స్ బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతేకానీ గత రికార్డ్స్‌ను పరిగణలోకి తీసుకోవద్దు.'అని మైకేల్ వాన్ చురకలు అంటించాడు.
మైకేల్ అథర్టన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'టాస్ గెలిచిన బెన్ స్టోక్స్ బౌలింగ్ ఎంచుకోవడం ఆసక్తికరంగా అనిపించింది. గత 6 మ్యాచ్‌ల్లో ఇక్కడ తొలి బౌలింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. కానీ కామెన్ సెన్స్ ఉన్నవారు ఎవరూ కూడా ఈ కండిషన్స్‌లో బౌలింగ్ ఎంచుకోరు. ఎందుకంటే తీవ్రమైన ఎండ ఉంది. రానున్న రెండు రోజుల్లో 30 డిగ్రీలకు పైగానే ఉంటుంది. స్టోక్స్ కేవలం గత రికార్డ్ ఆధారంగానే తొలుత బౌలింగ్ ఎంచుకొని ఉంటాడు.'అని స్టోక్స్ నిర్ణయాన్ని తప్పుబట్టాడు. అయితే భారీ లక్ష్యాన్ని చేధించే సత్తా ఇంగ్లండ్‌కు ఉందని చెప్పాడు.
ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'బౌలింగ్‌కు అనుకూలంగా లేని పరిస్థితుల మధ్య టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సాహసమే. ఇంగ్లండ్ పశ్చాతాపపడాల్సిన పరిస్థితి తలెత్తింది. గత 6 మ్యాచ్‌ల్లో బౌలింగ్ చేసిన జట్లు గెలిచాయి. కానీ భారత బ్యాటర్లు స్వేచ్ఛగా ఆడటం చూస్తే తాము చేసిన తప్పేమిటో ఇంగ్లండ్‌కు అర్థమై ఉంటుంది.'అలిస్టర్ కుక్ అన్నాడు. ఇంగ్లండ్ బౌలింగ్ కన్సల్టెంట్ టిమ్ సౌథీ మాత్రం స్టోక్స్ నిర్ణయాన్ని సమర్థించాడు. పిచ్ రంగు, అందులో ఉన్న తేమ బౌలర్లకు తొలి సెషన్లో సహాయపడుతుందని భావించామని తెలిపాడు.