టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ(27 బంతుల్లో 3 ఫోర్లతో 24) అనవసరపు షాట్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. దాంతో రోహిత్ శర్మ బ్యాటింగ్ అప్రోచ్‌పై ఫ్యాన్స్, క్రికెట్ విశ్లేషకులు మండిపడుతున్నారు.
అంత నిర్లక్ష్యమైన షాట్ ఆడాల్సిన అవసరం ఏం ఉందని ప్రశ్నిస్తున్నారు. జాక్ లీచ్ వేసిన 13వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ రెండో బంతిని ఆడేందుకు స్టెప్ ఔటైన రోహిత్.. లాంగాన్ దిశగా సిక్సర్ కొట్టే ప్రయత్నం చేశాడు. కానీ మిస్ టైమ్ అయిన బంతి గాల్లోకి లేవగా.. బెన్ స్టోక్స్ అద్భుతంగా అందుకున్నాడు.

దాంతో తీవ్ర నిరాశకు గురైన రోహిత్.. అనవసరంగా షాట్ ఆడానని అసహనం వ్యక్తం చేస్తూ పెవిలియన్ చేరాడు. ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారగా.. రోహిత్ శర్మ ఆట తీరుని ఫ్యాన్స్ తప్పుబడుతున్నారు. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ధాటిగా ఆడుతున్నప్పుడు నిలకడగా ఆడుతూ.. యాంకర్ రోల్ పోషించాల్సిన రోహిత్ చెత్త షాట్ ఆడటం ఏ మాత్రం సమంజసం కాదని అభిప్రాయపడుతున్నారు.
మరికొందరు మాత్రం రోహిత్ శర్మకు అండగా నిలుస్తున్నారు. బంతి పాతబడితే టర్న్ అవుతుందని, కొత్తగా ఉన్నప్పుడే పరుగులు రాబట్టాలనే ఉద్దేశంతో రోహిత్ ధాటిగా ఆడాడని అతన్ని సమర్థిస్తున్నారు. జాక్ లీచ్ బౌలింగ్‌లో రోహిత్ శర్మ ఔటవ్వడం ఇది ఐదో సారి. ఏడు ఇన్నింగ్స్‌ల్లో జాక్ లీచ్ బౌలింగ్ ఎదుర్కొన్న రోహిత్ ఐదు సార్లు ఔటై 95 పరుగులే చేశాడు. రోహిత్ షాట్ సెలెక్షన్‌ను సునీల్ గవాస్కర్ సైతం తప్పుబట్టాడు.
యశస్వి జైస్వాల్(70 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 76 బ్యాటింగ్), రోహిత్ శర్మ(27 బంతుల్లో 3 ఫోర్లతో 24) అదిరిపోయే ఆరంభాన్ని అందించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా వికెట్ నష్టానికి 119 పరుగులు చేసింది. క్రీజులో యశస్వీతో పాటు శుభ్‌మన్ గిల్(14 బ్యాటింగ్) ఉన్నాడు. భారత్ ఇంకా 127 పరుగుల వెనుకంజలో ఉంది.
అంతకుముందు ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్‌స్టో(58 బంతుల్లో 5 ఫోర్లతో 37), బెన్ డకెట్(39 బంతుల్లో 7 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/88), అశ్విన్(3/68) మూడేసి వికెట్లు తీయగా... అక్షర్ పటేల్(2/33), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు.