టీమిండియా యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ (66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) దుమ్మురేపాడు. అరంగేట్ర మ్యాచ్‌లోనే రికార్డు హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. దేశవాళీ క్రికెట్‌లో పరుగుల మోత మోగించిన ఈ యూపీ కుర్రాడు.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఫియర్‌లెస్ గేమ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 48 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి భారత్ తరఫున అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన బ్యాటర్‌గా హార్దిక్ పాండ్యా సరసన నిలిచాడు.
స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన సర్ఫరాజ్ ఖాన్ సునాయసంగా సెంచరీ చేసేలా కనిపించాడు. కానీ రనౌట్ రూపంలో దురదృష్టం అతన్ని వెంటాడింది. సీనియర్ ఆల్‌రౌండర్, లోకల్ భాయ్ రవీంద్ర జడేజా చేసిన తప్పిదం అతను రనౌటయ్యేలా చేసింది. సెంచరీకి చేరువైన జడేజా.. ఒత్తిడిలో చేసిన తప్పిదం సర్ఫరాజ్ ఖాన్ కొంపముంచింది.

99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అండర్స్ వేసిన 82 ఓవర్ ఐదో బంతిని జడేజా మిడాన్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు పిలుపునిచ్చాడు. నాన్‌స్ట్రైకర్‌గా ఉన్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా పిలుపుతో క్రీజును ధాటాడు. బంతిని ఫీల్డర్ అందుకోవడం చూసిన జడేజా యూటర్న్ తీసుకోగా.. సర్ఫరాజ్ ఖాన్ వెనక్కి పరుగెత్తేలోపు మార్క్ వుడ్ బంతిని డైరెక్ట్ హిట్ చేశాడు. దాంతో సర్ఫరాజ్ ఖాన్ నిరాశగా పెవిలియన్ చేరాడు.
అతని తండ్రితో పాటు సతీమణి, కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ రనౌట్‌తో తీవ్ర ఆవేదనకు గురయ్యారు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ అయితే తన క్యాప్‌ను నేలకు కొట్టాడు. జడేజా కూడా తీవ్ర బాధకు గురయ్యాడు. ఆ మరుసటి బంతికి సింగిల్ తీసి జడేజా శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అయితే ఎలాంటి సంబరాలు చేసుకోలేదు. జడేజా కాస్త అప్రమత్తంగా ఉండి ఉంటే సర్ఫరాజ్ ఖాన్ శతకం సాధించేవాడని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పాపం సర్ఫరాజ్ అని అతనికి మద్దతుగా నిలుస్తున్నారు.