గత 6 నెలలుగా ఫామ్‌లో లేడు.. 16 నెలలుగా వన్డేల్లో సెంచరీ సాధించలేదు. మరోవైపు జట్టుకు భారమయ్యాడనే విమర్శలు.. రిటైర్మెంట్ ప్రకటించాలనే సలహాలు, సూటి పోటీ మాటలు! ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏ బ్యాటర్ అయినా సెంచరీ ముంగిట నిలిస్తే.. ఆచితూచి ఆడుతూ శతకం పూర్తి చేసుకునే ప్రయత్నం చేస్తారు. కానీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రం ఇవేవి పట్టించుకోకుండా తనదైన శైలిలో సిక్సర్ బాది సెంచరీ మార్క్ అందుకున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు బ్యాట్‌తోనే బదులిచ్చాడు.
ఇంగ్లండ్‌తో కటక్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో విధ్వంసకర శతకంతో చెలరేగి హిట్ మ్యాన్ ఫామ్‌లోకి వచ్చాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన రోహిత్ భారీ సిక్స్‌లతో తన పాత ఆటను చూపించాడు. ఆదిల్ రషీద్ వేసిన 26వ ఓవర్‌లో రెండో బంతిని సిక్సర్ తరలించి 76 బంతుల్లో శతకాన్ని పూర్తి చేసుకున్నాడు.

ఈ సెంచరీని రోహిత్ శర్మ చాలా నిశబ్దంగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. కనీసం హెల్మెట్ కూడా తీయకుండా బ్యాట్‌తోనే అభిమానులకు అభివాదం చేశాడు. పవర్ ప్లేలోనే 4 ఫోర్లు, 4 భారీ సిక్స్‌లు బాది 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్ శర్మ.. ఆ తర్వాత మరో మూడు సిక్స్‌లు, 5 ఫోర్లతో శతకం సాధించాడు. అప్‌కమింగ్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి ముందు విధ్వంసకర శతకంతో ప్రత్యర్థి జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.
వన్డే క్రికెట్‌లో రోహిత్ శర్మకు ఇది 32వ శతకం. భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక శతకాలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ తర్వాత రోహిత్ శర్మ నిలిచాడు. రోహిత్ శర్మకు ఇది రెండో అత్యంత వేగమైన శతకం కావడం విశేషం. సిక్సర్‌తో సెంచరీ మార్క్ అందుకోవడంపై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రత్యర్థులకు ఇక దబిడి దిబిడేనని కామెంట్ చేస్తున్నారు. 'ఏం గుండెరా అది.. సిక్సర్‌తో శతకమా?'అని కొనియాడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా రోహిత్ శర్మ పేరు మారుమోగుతోంది.
హిట్ మ్యాన్ శతకంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం దిశగా సాగుతోంది. రోహిత్‌కు జతగా శ్రేయస్ అయ్యర్ రాణిస్తున్నాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(52 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 60) హాఫ్ సెంచరీతో రాణించగా.. విరాట్ కోహ్లీ(5) తీవ్రంగా నిరాశపరిచాడు.
అంతకుముందు ఇంగ్లండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకే ఆలౌటైంది. బెన్ డక్కెట్(56 బంతుల్లో 10 ఫోర్లతో 65), జోరూట్(72 బంతుల్లో 6 ఫోర్లతో 69) హాఫ్ సెంచరీలతో రాణించగా.. లియామ్ లివింగ్ స్టోన్(32 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 41), జోస్ బట్లర్(35 బంతుల్లో 2 ఫోర్లతో 34) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/35) మూడు వికెట్లు తీయగా.. మహమ్మద్ షమీ, హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, వరుణ్ చక్రవర్తీ తలో వికెట్ తీసారు.