ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో హైదరాబాద్ వేదికగా సాగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. అసాధారణ ప్రదర్శనతో తొలి రెండు రోజులు పూర్తి ఆధిపత్యం చెలాయించిన రోహిత్ సేన.. మూడో రోజు నుంచి తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్‌లో బౌలింగ్, బ్యాటింగ్‌లో సత్తా చాటిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్‌లో తేలిపోయింది.
బ్యాటింగ్‌లోనూ తడబడుతోంది. 231 పరుగుల సాధారణ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 119 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. పిచ్‌పై ఉన్న పగుళ్లను అడ్వాంటేజ్‌గా మార్చుకున్న ఇంగ్లండ్ స్పిన్నర్లు భారత బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు.

ముఖ్యంగా శుభ్‌మన్ గిల్(0) దారుణ వైఫల్యం టీమిండియాకు తీవ్ర నష్టం చేసింది. భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది. భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్(15), రోహిత్ శర్మ(39) మరోసారి దూకుడుగా భారత ఇన్నింగ్స్ ప్రారంభించారు. అయితే వీరి జోరుకు హార్ట్‌లీ బ్రేక్ వేసాడు. యశస్వి(15)ని క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్ గిల్‌ను సిల్వర్ డక్ చేశాడు. దాంతో భారత్ 2 పరుగుల వ్యవధిలోనే రెండు వికెట్లు కోల్పోయింది.
ఇది భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడిని క్రియేట్ చేసింది. ఇదే జోరులో చెలరేగిన హార్ట్‌లీ నిలకడగా ఆడుతున్న రోహిత్ శర్మ(39)ను వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. ఆ కొద్ది సేపటికే అక్షర్ పటేల్(17) రిటర్న్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు.
ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్(22)ను జోరూట్ వికెట్ల ముందు బోల్తా కొట్టించాడు. అక్షర్ పటేల్‌ను అప్‌దీ ఆర్డర్ పంపిస్తూ టీమిండియా చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. జట్టును ఆదుకుంటాడని భావించిన జడేజా(2) బెన్ స్టోక్స్ సూపర్ త్రోకు రనౌట్‌గా వెనుదిరగ్గా.. శ్రేయస్ అయ్యర్(13) తన వైఫల్యాన్ని కొనసాగించాడు.
అయితే టీమిండియా పరిస్థితికి శుభ్‌మన్ గిల్ కారణమని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. గిల్ కనీసం 20 పరుగులు చేసినా పరిస్థితి మరోలా ఉండేదని, రోహిత్, రాహుల్, అక్షర్ స్వేచ్చగా బ్యాటింగ్ చేసేవారని అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం క్రీజులో కేఎస్ భరత్, రవీంద్ర అశ్విన్ ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 111 పరుగుల అవసరమవ్వగా.. ఇంగ్లండ్ గెలుపునకు 3 వికెట్లు కావాలి.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 246 పరుగులకు ఆలౌటైంది. బెన్ స్టోక్స్(70) ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించగా.. జడేజా, అశ్విన్ మూడేసి వికెట్లు తీసారు. అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 436 పరుగుల భారీ స్కోర్ చేసింది. రవీంద్ర జడేజా(87), యశస్వి జైస్వాల్(80), కేఎల్ రాహుల్(86) రాణించారు. దాంతో భారత్‌కు 190 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్ ఇంగ్లండ్.. ఓలిపోప్(196) సూపర్ బ్యాటింగ్‌తో 420 పరుగులు చేసింది. దాంతో భారత్ ముందు 231 పరుగుల లక్ష్యం నమోదైంది.