ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో టీమిండియా ఫీల్డింగ్ వైఫల్యంపై మాజీ ఫీల్డింగ్ కోచ్ ఆర్ శ్రీధర్ స్పందించాడు. చల్లటి వాతావరణంలో క్యాచ్‌లు పట్టడం కష్టమేనని అభిప్రాయపడ్డాడు. నాలుగు క్యాచ్‌లు వదిలేసిన యశస్వి జైస్వాల్‌కు ఆర్ శ్రీధర్ అండగా నిలిచాడు.లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో భారత ఆటగాళ్లు దాదాపు 10 క్యాచ్‌లు నేలపాలు చేశారు. దాంతో గెలవాల్సిన ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఈ క్రమంలోనే భారత ఫీల్డింగ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే భారత ఆటగాళ్లను ఆర్ శ్రీధర్ వెనకేసుకొచ్చాడు.
'ఇంగ్లండ్‌లో తొలి పర్యటనకు వెళ్లి స్లిప్‌లో ఫీల్డింగ్ చేయడం అంత సులువైన పని కాదు. ఎంతో ప్రాక్టీస్ చేసినప్పటికీ.. మ్యాచ్ విషయానికి వచ్చేసరికి క్యాచ్‌లు అందుకోవడం సవాలుతో కూడుకున్నది. అక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. దాంతో చేతివేళ్లు మొద్దుబారి పోయి ఉంటాయి. అలాగే డ్యూక్ బంతిని పట్టుకోవడం అంత తేలికైన విషయం కాదు. ఇంగ్లండ్‌లో బంతిని చూడటం చాలా కష్టం. ఓవల్, లీడ్స్‌లో మైదానాలు చాలా కఠినమైనవి.

లీడ్స్ పెవిలియన్ వైపు మైదానం వాలుగా ఉంటుంది. గాలులు కూడా వేగంగా వీస్తుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఫీల్డింగ్ చేయడం చాలా కష్టం. ఇంగ్లండ్ ఆటగాళ్లు కూడా క్యాచ్‌లు వదిలేశారు. ఇక్కడ సమస్య సామర్థ్యం గురించి కాదు. పరిస్థితుల గురించి మాత్రమే. వాస్తవానికి యశస్వి జైస్వాల్ అద్భుతమైన ఫీల్డర్. ఆస్ట్రేలియా పర్యటనలోనూ క్యాచ్ పట్టే విషయంలో యశస్వి ఇబ్బంది పట్టాడు. అయితే భారత్ వేదికగా జరిగిన మ్యాచ్‌ల్లో అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. కామెంట్రీ బాక్స్‌లో కూర్చొని విమర్శించడం తేలికే. కానీ ఇంగ్లీష్ కండిషన్స్‌లో అతను తొలిసారి ఆడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. 'అని శ్రీధర్ వివరించాడు.