
సమయం వచ్చేసింది
నాలుగో టెస్టుకు ముందు దినేశ్ కార్తీక్ డైలీ టెలిగ్రాఫ్‌కు ఓ కథనం రాశాడు. 'వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆడేందుకు సమయం వచ్చేసింది. ఇంగ్లండ్‌లోని ఫ్లాట్ పిచ్‌ల్లో ఓవల్ మైదానం ఒకటి. ఎప్పట్లాగే ఈ సీజన్లోనూ అక్కడి వికెట్లో పెద్ద మార్పులేమీ లేవు. ఇక్కడ సర్రే ఆడిన ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఫలితం తేలలేదు.
ఆ మ్యాచుల్లో ఏకంగా పది సెంచరీలు నమోదయ్యాయి. అశ్విన్ బౌలింగ్‌లోని వైవిధ్యం ఓవల్ మైదానంలో టీమిండియాకు ఎంతో సాయపడుతుంది' అని కార్తీక్ అన్నాడు. ఇటీవలే కార్తీక్ వ్యాఖ్యాతగా మారిన విషయం తెలిసిందే. ఎలాంటి అనుభవం లేకున్నా డీకే వ్యాఖ్యానంలో అదరగొడుతున్నాడు.

ప్రతిభతోనే వికెట్లు తీశాడు
'నేనే విరాట్ కోహ్లీని అయితే కీలకమైన ఈ టెస్టులో సరికొత్త సమీకరణాలు తీసుకొస్తా. నిజానికి ఆర్ అశ్విన్ తన కెరీర్లో ఎప్పుడూ పిచ్‌లపై ఆధారపడలేదు. తన ప్రతిభతో మాత్రమే వికెట్లు తీశాడు. పైగా ఇంగ్లండ్ టాప్-3లో ఇద్దరు, టాప్-7లో ముగ్గురు ఎడమ చేతివాటం ఆటగాళ్లు ఉన్నారు.
ఎడమ చేతివాటం వారిపై అశ్విన్‌కు ఉన్న రికార్డు మరెవ్వరికీ లేదు. అంతమంచి రికార్డు అతడికి ఉంది. అంతేకాకుండా నకుల్ బంతి, ఫ్లోటర్స్‌తో అతడు కుడిచేతి బ్యాటర్లను కూడా బోల్తా కొట్టిస్తాడు' అని దినేష్ కార్తీక్ తెలిపాడు. కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు.
పెళ్లికి ఇప్పుడు తొందరేంలేదు.. కెరీర్‌లో ఇంకా ఎంతో సాదించాలి: స్టార్ పేసర్

తొలి గంటలోనే బౌలింగ్ వేయించొచ్చు
'ఆస్ట్రేలియాలో కూకాబుర్ర బంతిని రవి అశ్విన్ అద్భుతంగా డ్రిఫ్ట్ చేశాడు. పిచ్ అయ్యే ముందరే గాల్లో బంతిని గింగరాలు తిప్పాడు. స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్‌ను ఆ విధంగా ఔట్ చేశాడు. అంతేకాకుండా యాంగిల్స్‌తో మాయ చేసేందుకు వికెట్లకు రెండు వైపుల నుంచి బంతులు విసురుతాడు. ఆసీస్ పిచ్‌ల మాదిరిగానే ఓవల్‌లో బౌన్స్ ఉంటుంది.
దాన్ని ఉపయోగించుకొని యాష్ వికెట్లు తీయగలడు. అశ్విన్‌తో ఆరంభ ఓవర్లు వేయించొచ్చు. పిచ్ కాస్త చిత్తడిగా ఉంటే తొలి గంటలోనే యాష్‌తో బౌలింగ్ వేయించొచ్చు. ఇది టీమిండియాకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది' అని సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ చెప్పుకొచ్చాడు.

అవకాశం దొరకడం దాదాపు అసాధ్యమే
దినేశ్ కార్తీక్ భారత్ తరఫున 26 టెస్టులు, 94 వన్డేలు, 32 టీ20లు ఆడాడు. ఇక 203 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు. 2019 వన్డే ప్రపంచకప్‌లో డీకే చివరిసారి భారత్ తరఫున మ్యాచ్ ఆడాడు. న్యూజిలాండ్‌తో ఆడిన సెమీ ఫైనల్లో విఫలమైన డీకే.. కేవలం 6 పరుగులే చేశాడు. దాంతో అప్పటి నుంచి డీకేను భారత్ తుది జట్టులోకి తీసుకోలేదు.
అయితే ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో చోటు కోసం అతడు ప్రయత్నిస్తున్నాడు. కానీ అది అసాధ్యమే. ఇప్పటికే జట్టులో ఒక్కోస్థానం కోసం ఇద్దరు పోటీలో ఉన్నారు. ఐపీఎల్ 2021లో మంచి ప్రదర్శన చేసినా.. అవకాశం దొరకడం దాదాపు అసాధ్యమే. ఐపీఎల్ 2021లోని మిగిలిన మ్యాచులు యూఏఈ వేదికగా ఈ నెల 19న ఆరంభం కానున్నాయి.


Click it and Unblock the Notifications












