అరంగేట్ర మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ సాధించడంపై టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ సంతోషం వ్యక్తం చేశాడు. అరంగేట్ర క్యాప్ అందుకున్న తర్వాత కాస్త అసౌకర్యంగా ఫీలైనా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ మాటలతో రెండు చేతులు జేబులో పెట్టుకొని ధైర్యంగా మైదానంలోకి అడుగుపెట్టానని తెలిపాడు.
ఇంగ్లండ్‌తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్‌తో అంతర్జాతీయ టెస్ట్‌ల్లోకి అరంగేట్రం చేసిన పడిక్కల్ తొలి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. రెండో రోజు ఆట అనంతరం తన ఇన్నింగ్స్ గురించి మాట్లాడిన ఈ బెంగళూరు కుర్రాడు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

'టెస్ట్ ఫార్మాట్‌లో అరంగేట్రం చేయడం కోసం నేను సిద్దంగా ఉన్నాను. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు రోజు.. నేను ఆడగలిగే అవకాశం ఉందని టీమ్‌మేనేజ్‌మెంట్ నుంచి మెసేజ్ వచ్చింది. ఆ రాత్రి నిద్ర కూడా పోలేదు. కాస్త ఆందోళనకు గురయ్యాను. కానీ సానుకూల ఆలోచనలతో మ్యాచ్‌కు రెడీ అయ్యాను.
బ్యాటింగ్ కోసం వెళ్లేటప్పుడు కాస్త అసౌకర్యంగా అనిపించింది. కానీ ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సర్ఫరాజ్ ఖాన్‌తో భాగస్వామ్యం నెలకొల్పాలనే పట్టుదలతో బ్యాటింగ్ చేశా. అరంగేట్ర క్యాప్ అందుకోవడం ప్రత్యేకమైన అనుభూతి. టెస్ట్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించడం నా కల. అది సాకరమయ్యే క్షణం ఎవరికైనా ప్రత్యేకమే.
మైదానంలోకి అడుగుపెట్టి ఓ బౌండరీ బాదిన తర్వాత బ్యాటింగ్ చేయడం సులువైంది. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్ వంటి టాప్ క్లాస్ బౌలర్లను ఎదుర్కోవడం చాలెంజింగ్‌గా అనిపించింది. ఈ ఇద్దరు రివర్స్ స్వింగ్‌తో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ నేను వికెట్‌కు తగ్గట్లు బ్యాటింగ్ చేశాను. గత కొన్నేళ్లుగా నేను అనేక సవాళ్లను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా నా అనారోగ్య సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డాను. ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవడం చాలా కష్టంగా ఉంటుంది.
అయితే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అప్పుడే అనుకున్నాను. అరంగేట్ర క్యాప్ అందుకునే సమయంలో తెలిసిన ఆటగాళ్లు ఉండటం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ముఖ్యంగా రాహుల్ సర్ చెప్పిన మాటలు ధైర్యాన్నిచ్చాయి. 10-15 నిమిషాలు ఆందోళనగా ఉంటుందని, ఆటను ఆస్వాదించాలని చెప్పాడు. ఆ మాటలతో రెండు చేతులను జేబులో పెట్టుకొని ధైర్యంగా మైదానంలోకి అడుగుపెట్టాను.
మేం ఇంకాస్త మెరుగ్గా బ్యాటింగ్ చేయాల్సింది. చివరి సెషన్ వరకు క్రీజులో ఉండాల్సింది. మా జట్టులో ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్లు ఉన్నారు. కచ్చితంగా వారు సత్తా చాటుతారు.'అని దేవదత్ పడిక్కల్ చెప్పుకొచ్చాడు.