
నాటింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఫస్ట్ టెస్ట్‌ను వరణుడు వెంటాడుతూనే ఉన్నాడు. తొలి రోజు ఆటను సజావుగా జరగనిచ్చినా.. రెండో రోజు అంతరాయం కలిగించడంతో 33.4 ఓవర్ల ఆటనే సాధ్యమైంది. ఇక మూడో రోజు చివరి సెషన్ మొత్తం రద్దవ్వగా.. నాలుగో రోజైన శనివారం కూడా అదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అక్కడి వాతావారణ శాఖ తెలిపింది.
నాలుగో రోజు ట్రెంట్‌బ్రిడ్జ్‌లో వర్షం పడే అవకాశం ఉన్నట్లు బ్రిటన్ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉదయం వర్షం కురుస్తుందని, దాంతో నాలుగో రోజు ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. మధ్యమధ్యలో వాన వెలిసిప్పటికీ.. వర్షం పడటం వల్ల అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారొచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమయంలో- వెలుతురు లేమి కూడా మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది. మ్యాచ్‌కే అంతరాయం కలిగితే తొలి టెస్ట్ డ్రా అవ్వడం ఖాయం.
ఇక ఓవర్‌నైట్ స్కోరు 125/4తో మూడో రోజైన శుక్రవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ 278 వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ (84) మరో 27 రన్స్ జోడించగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (86 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్‌తో 56) అర్ధ సెంచరీతో చెలరేగాడు. బుమ్రా 28, పంత్ 25 పరుగులు చేశారు. రాబిన్‌సన్ 5, అండర్సన్ 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ వర్షంతో ఆట నిలిపివేసే సమయానికి 25/0 స్కోరు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 183 స్కోరు వద్ద ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే ఈ రోజు ఆట కొనసాగడం చాలా కీలకం.
కాగా, ఇంగ్లాండ్‌లోనే జూన్‌లో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ముగిసిన ప్రపంచకప్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో వరుణుడు ఎంత కీలక పాత్ర పోషించాడనేది మనకు తెలిసిన విషయమే. వర్షం వల్ల ఏకంగా రెండున్నర రోజుల పాటు మ్యాచ్ పూర్తిగా రద్దయింది. అయినప్పటికీ- న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌ను తన సొంతం చేసుకుంది. అతి తక్కువ సెషన్లలోనే పక్కా బ్యాటింగ్, బౌలింగ్‌తో కోహ్లీసేనపై విజయాన్ని సాధించింది కివీస్ టీమ్. ఇప్పుడు కూడా నాటింగ్ హామ్ ట్రెంట్‌బ్రిడ్జ్‌లో దాదాపుగా అదే తరహా వాతావరణం నెలకొని ఉంది. వాతావరణం సహకరించి.. మ్యాచ్ కొనసాగిస్తే భారత్ విజయం సాధించే అవకాశాలున్నాయి.