
ఓవల్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ పేసర్ క్రిస్ వోక్స్ తన ఫస్ట్ ఓవర్‌లోనే మాయా చేశాడు. క్రీజులో స్వేచ్చగా ఆడుతున్న టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ(27 బంతుల్లో ఫోర్‌తో 11)ను ఎక్స్‌ట్రా బౌన్స్‌తో బోల్తా కొట్టించాడు. గాయంతో గత మ్యాచ్‌కు దూరమైన క్రిస్ వోక్స్ రీఎంట్రీలో అదరగొడుతున్నాడు. దాంతో భారత్ 28 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. క్రీజులోకి చతేశ్వర్ పుజారా(0 బ్యాటింగ్)రాగా.. కేఎల్ రాహుల్(17 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించే బాధ్యతను తీసుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా భారత్ బ్యాటింగ్‌కు దిగింది. ఇరు జట్లలో రెండేసి మార్పులు చోటు చేసుకున్నాయి. భారత జట్టులో మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మ ఉద్వాసనకు గురవ్వగా.. శార్దూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ జట్టులోకి వచ్చారు. ఇక సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ జట్టులో సామ్ కరన్, జోస్ బట్లర్ స్థానాల్లో ఓలీ పోప్, క్రిస్ వోక్స్ చోటు దక్కించుకున్నారు.
దిగ్గజ కోచ్ వాసూదేవ్ పరంజాపే మృతికి సంతాపంగా ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్స్‌తో బరిలోకి దిగారు. గత సోమవారం ఆయన గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ట్విటర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'శ్రీ వాసువేదవ్ పరంజాపే మృతికి సంతాపంగా భారత ఆటగాళ్లు బ్లాక్ ఆర్మ్ బాండ్స్ బరిలోకి దిగారు'అని ఆటగాళ్లకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేసింది.
ముంబై, బరోడా జట్ల తరపున 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 785 పరుగులు చేసిన పరంజాపే... క్రికెటర్‌గా ఆయన ఆడింది తక్కువే అయినా.. కోచ్‌గా మాత్రం సక్సెస్ అయ్యారు. ఎంతో మంది భారత లెజెండరీ క్రికెట్లను తీర్చిదద్దడంలో పరాంజమే కృషి మరువలేనిది. సునిల్ గవాస్కర్, దిలీప్ వెంగ్‌సర్కార్, సంజయ్ మంజ్రేకర్ , రాహుల్ ద్రవిడ్ , సచిన్ టెండుల్కర్ యువ్‌రాజ్ సింగ్, రోహిత్ శర్మ వంటి క్రికెటర్లకు ఆయన కోచింగ్ ఇచ్చాడు. టాలెంటెడ్ క్రికెటర్లను గుర్తించడంలో పరాంజపేను మించిన కోచ్ లేడని ఇప్పటికీ చెబుతుంటారు.
ఒక క్రికెటర్ భవిష్యత్ ఎలా ఉండబోతోందనేది అతడి ఆటను చూసి పరాంజపే చెప్పేవాడంట. 1960, 70లలో ముంబైలో దాదార్ యూనియర్ స్పోర్ట్స్ క్లబ్ అనేది చాలా ఫేమస్. ఆ క్లబ్ తరపున ఆడాలని ఎంతో మంది కలలు కనేవారు. ముంబై నుంచి కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలకు చెందిన క్రికెటర్లు దాదర క్లబ్‌లో ఛాన్స్ కోసం ఎదురు చూస్తుండే వాళ్లు. ఆ సమయంలో పరాంజపే ఆ క్లబ్‌లో కెప్టెన్, కోచ్, మెంటార్‌గా ఉన్నాడు. ఎంతో మంది క్రికెటర్ల సహజమైన టాలెంట్‌ను గుర్తించడంలో పరాంజపే సఫలమయ్యాడు.