
1971లో గెలిచింది..
అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే 50 ఏళ్ల నిరీక్షణకు తెరపడుతుంది. ఓవల్ మైదానంలో భారత్ గత 50 ఏళ్లుగా ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఓవల్‌లో భారత్ చివరి సారిగా 1971లో గెలిచింది. అజిత్ వాడేకర్ సారథ్యంలోని భారత జట్టు ఆతిథ్య జట్టును 4 వికెట్ల తేడాతో ఓడించింది. అదే ఈ మైదానంలో భారత్ అందుకున్న చివరి విజయం. ఆ తర్వాత 8 మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఒక్కదాంట్లో విజయం సాధించ లేదు. చివరి మూడింటిలో చిత్తుగా ఓడి.. అంతకుముందు ఐదు మ్యాచ్‌ల్లో డ్రా చేసుకుంది.

ఇన్నింగ్స్ తేడా చిత్తు..
ఇక గత మూడు పర్యటనల్లో(2011, 2014, 2018) అయితే ఘోర పరాజయం చవి చూసింది. 2011, 2014 పర్యటనల్లో ఇన్నింగ్స్ తేడాతో ఓటమిపాలైంది. 1936 నుంచి ఈ వేదికపై ఆడిన భారత్.. 1971లో విజయం తర్వాత వరుసగా ఐదు మ్యాచ్‌లు డ్రా చేసుకుంది. ఇక చివరి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం ఘోర పరాజయాలు చవిచూసింది. 2011లో ఇన్నింగ్స్, 8 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా.. 2014 టూర్‌లో ఇన్నింగ్స్ 244 రన్స్‌తో చిత్తయింది. 2018 పర్యటనలో 118 రన్స్ తేడాతో ఓటమిపాలైంది.

పది పడాలి..
తమ ఖాతాలో మరో విజయం వేసుకొని ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలంటే భారత బౌలర్లు నాలుగో టెస్టులో చివరి రోజు సత్తా చాటుకోవాలి. ఆఖరి రోజు మొత్తం 10 వికెట్లు పడగొడితేనే భారత్‌కు విజయం దక్కుతుంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు కూడా విజయంపై కన్నేసింది. 368 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆదివారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 77 పరుగులు చేసింది. ఓపెనర్లు బర్న్స్ (31 బ్యాటింగ్), హసీబ్ (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అంతకుముందు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 148.2 ఓవర్లలో 466 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 368 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. శార్దుల్ ఠాకూర్ (72 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 60) వన్డే తరహా ఇన్నింగ్స్ ఆడగా... వికెట్ కీపర్ రిషభ్ పంత్ (106 బంతుల్లో 4 ఫోర్లతో 50) రాణించాడు. క్రిస్ వోక్స్ 3 వికెట్లు తీశాడు.

రికార్డులు కష్టమేనంటున్నా..
టె స్టు మ్యాచ్‌లో మూడొందలపై లక్ష్యాన్ని ఛేదించడం చాలా కష్టమని రికార్డులు చెబుతున్నాయి. అది ఇంగ్లండ్ గడ్డపై నాలుగో రోజు చేజింగ్ అంటే ఇంకా కష్టం. కానీ ప్రస్తుత పరిస్థితులేమో బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాలుగో టెస్టు ఆసక్తికర ముగింపు దిశగా సాగుతోంది. అద్భుత పోరాటంతో మ్యాచ్‌లో కోహ్లీసేన పటిష్ట స్థితిలో నిలిచినా.. ఆతిథ్య జట్టు అవకాశాలనూ కొట్టిపారేసే పరిస్థితి లేదు. చివరి రోజు ఆటలో తొలి గంటనే మ్యాచ్ ఫలితాన్ని శాసించనుంది. ఈ ఫస్ట్ సెషన్‌లో వీలైనన్ని వికెట్లు తీస్తే ఆతిథ్య జట్టుపై తీవ్ర ఒత్తిడి నెలకొంటుంది. అప్పుడు లార్డ్స్ టెస్ట్ మాదిరి ఇంగ్లండ్‌ను మట్టికరిపించవచ్చు.

అశ్విన్ ఉంటే..?
బ్యాటింగ్‌కు అనుకూలమైన ఓవల్ వికెట్‌పై టర్నింగ్ లభిస్తుంది. నాలుగో రోజు ఆటలో క్రీజులో కుదురుకున్న రిషభ్ పంత్-శార్దల్ ఠాకూర్‌ను కెప్టెన్ జోరూట్ వీడదీయడంతో ఈ విషయం స్పష్టంగా తెలిసింది. అంతకుముందు హాఫ్ సెంచరీకి చేరువైన కోహ్లీని కూడా స్పిన్నర్ మొయిన్ అలీనే ఔట్ చేశాడు. ఈ పరిస్థితుల్లో టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఉంటే.. ఇంగ్లండ్ మరింత కష్టమయ్యేదని విశ్లేషకులు అంటున్నారు. పైగా ఓవల్‌లో అశ్విన్‌కు మంచి రికార్డు ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇదే వేదికగా కౌంటీ క్రికెట్ ఆడిన అశ్విన్ 6 వికెట్లు తీశాడు. వీటిని పట్టించుకోని టీమిండియా.. బ్యాటింగ్ డెప్త్ కోసం జడేజాను తీసుకుంది. తీరా అతను బ్యాటింగ్‌లో దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్‌లో పర్వాలేదనిపించినా.. రెండో ఇన్నింగ్స్‌లో ఏమేరకు రాణిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.!

సంక్షిప్త స్కోర్లు
భారత్ తొలి ఇన్నింగ్స్: 191 ఆలౌట్ (విరాట్ కోహ్లీ 50, శార్దూల్ ఠాకూర్ 57, క్రిస్ వోక్స్ 4/55, ఓలీ రాబిన్సన్ 3/38)
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 290 ఆలౌట్(ఓలీపోప్ 81, క్రిస్ వోక్స్ 50, ఉమేశ్ యాదవ్ 3/76, బుమ్రా 2/21)
భారత్ రెండో ఇన్నింగ్స్: 270/3 (రోహిత్ శర్మ 127, పుజారా 61, శార్దూల్ ఠాకూర్ 60, రిషభ్ పంత్ 50, క్రిస్ వోక్స్ 3/83)
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 77/0


Click it and Unblock the Notifications












