
లీడ్స్: ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన బాధలో ఉన్న భారత జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగో టెస్ట్‌కు అందుబాటులో ఉండటంపై అనుమానం నెలకొంది. శనివారం ముగిసిన మూడో టెస్ట్‌లో ఫీల్డింగ్ చేస్తూ జడేజా గాయపడ్డాడు. దాంతో మ్యాచ్ ముగిసిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. గతంలో కూడా మోకాలి గాయం ఉండటంతో మళ్లీ తిరగబెట్టిందని, ముందస్తు చర్యల్లో భాగంగా స్కానింగ్‌కు పంపించామని టీమ్ వర్గాలు పేర్కొన్నాయి. స్కానింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నాలుగో టెస్టులో జడేజా ఆడటంపై క్లారిటీ రానుంది.
ఇక ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసేలా జడేజా తన ఇన్‌స్టా స్టోరీలో ఫొటోను షేర్ చేశాడు. ఇందులో గ్రీన్ కలర్ స్క్రబ్ వేసుకొని ఉన్న జడేజా..'సురక్షితమైన ప్రాంతం కాదు'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఒక్కసారిగా గందరగోళానికి గురయ్యారు. జడేజాకు ఏమైందని గూగులమ్మను తెగ ఆరా తీసారు. చివరకు గాయం తిరగబెట్టడంతోనే ఆసుపత్రికి తరలించారనే విషయం వెలుగులోకి వచ్చింది. మూడో టెస్ట్‌లో 32 ఓవర్లు బౌలింగ్ చేసిన జడేజా కేవలం 2 వికెట్లు మాత్రం తీశాడు. అటు బ్యాటింగ్‌లోనూ తీవ్రంగా నిరాశపరిచాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి అతను 34 పరుగులు మాత్రమే చేశాడు.

ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో దుమ్మురేపిన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 76 పరుగుల తేడాతో ఘన విజయాన్నందుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 215/2తో నాలుగో రోజు శనివారం ఆట కొనసాగించిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 278 పరుగుల వద్ద ఆలౌటైంది. 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' రాబిన్సన్ (5/65), ఓవర్టన్ (3/47) భారత్ ఇన్నింగ్స్‌ను కూల్చేశారు.
చేతిలో 8 వికెట్లున్న భారత్ నాలుగో రోజు ఉదయం సెషన్‌లో ఇరవై ఓవర్లయినా పూర్తిగా ఆడలేకపోయింది. ఓవర్‌నైట్ స్కోరుకు కేవలం 63 పరుగులు జతచేసి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 78 పరుగులకే ఆలౌటవ్వగా.. ఇంగ్లండ్ 432 పరుగులు చేసింది. సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో నాలుగో టెస్టు జరుగుతుంది.