భారత గడ్డపై టెస్ట్ సిరీస్ కోల్పోయినా.. తమ జట్టు ఆట తీరు పట్ల గర్వంగా ఉందని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తెలిపాడు. ఇరు జట్లలోని కుర్రాళ్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారని కొనియాడాడు. రాంచీ వేదికగా ఉత్కంఠగా సాగిన నాలుగో టెస్ట్‌లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది.
ఈ విజయంతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. ఈ పరాజయం అనంతరం మాట్లాడిన బెన్ స్టోక్స్.. ఇదో గొప్ప మ్యాచ్ అని అభిప్రాయపడ్డాడు. ఈ సిరీస్ కోల్పోయినా నైతికంగా తమదే విజయమని తెలిపాడు. 'ఇదో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్. స్కోర్ బోర్డును చూస్తే భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. కానీ ఈ మ్యాచ్ జరిగిన విధానానికి భారత్‌కు ఈ గెలుపు క్రెడిట్ దక్కదు.

ఈ మ్యాచ్‌లో ఓడినా మా జట్టు ప్రదర్శన పట్ల గర్వపడుతున్నాను. మా జట్టులో అనుభవం లేని స్పిన్నర్లు ఉన్నారు. కానీ వారు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. కెప్టెన్‌గా యువకులకు స్వేచ్చనివ్వడం నా బాధ్యత. ముఖ్యంగా భారత్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో బౌలింగ్ చేయడం కష్టంతో కూడుకున్న పని. టెస్ట్ క్రికెట్‌కు నేను పెద్ద అభిమానిని. అయితే ఇరు జట్లలో కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన కనబర్చారు.
అసాధారణ గణంకాలతో మంచి భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు. మూడో రోజు ఆట చూసినప్పుడు ఈ మ్యాచ్‌లో ఏ ఫలితమైనా సాధ్యమని అనిపించింది. కానీ పిచ్ ఏ మాత్రం మెరుగవ్వదని మాకు ముందే తెలుసు. ఇక జో రూట్‌పై వచ్చిన విమర్శలు ఏ మాత్రం భావ్యం కాదు. అతను అసాధారణమైన ప్రదర్శన కనబర్చాడు. అలాగే బషీర్ కూడా 8 వికెట్లతో సత్తా చాటాడు. సిరీస్ గెలవాలంటే మ్యాచ్‌లు గెలవడం ముఖ్యం. ఈ సిరీస్‌లో ఓడినా.. మేం మా ప్రయత్నంలో ఎలాంటి తప్పిదం చేయలేదు. విజయం కోసం సాయశక్తులా పోరాడాం.'అని బెన్ స్టోక్స్ చెప్పుకొచ్చాడు.
192 పరుగుల లక్ష్యచేధన కోసం నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్.. 61 ఓవర్లలో 5 వికెట్లకు 192 పరుగులు చేసి గెలుపొందింది. ధ్రువ్ జురెల్(77 బంతుల్లో 2 ఫోర్లతో 39 నాటౌట్), శుభ్‌మన్ గిల్(124 బంతుల్లో 2 సిక్స్‌లతో 52 నాటౌట్), కెప్టెన్ రోహిత్ శర్మ(55) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో బషీర్ మూడు వికెట్లు తీయగా.. జో రూట్, టామ్ హార్ట్‌లీ తలో వికెట్ తీసారు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 353 పరుగులకు ఆలౌటైంది. జో రూట్(122 నాటౌట్) అజేయ శతకంతో రాణించాడు. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్ మూడు వికెట్లు పడగొట్టాడు. సిరాజ్‌కు రెండు వికెట్లు దక్కగా.. అశ్విన్ ఓ వికెట్ తీసాడు.
అనంతరం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 307 పరుగులే చేసింది. ధ్రువ్ జురెల్(90) అసాధారణ బ్యాటింగ్‌తో జట్టును ఆదుకోగా.. యశస్వి జైస్వాల్(73) తన ఫామ్‌ను కొనసాగించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(5/119) ఐదు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ మూడు వికెట్లు పడగొట్టాడు.
46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ 145 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ 5 వికెట్లతో ఇంగ్లండ్ పతనాన్ని శాసించగా.. కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసాడు.