Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs ENG: కొంపముంచిన చెత్త ఫీల్డింగ్.. గెలిచే మ్యాచ్‌లో ఓడిన భారత్!

ఇంగ్లండ్ పర్యటనను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో టీమిండియా శుభారంభం చేయలేకపోయింది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో చెత్త ఫీల్డింగ్, పేలవ బౌలింగ్‌తో ఐదు వికెట్లతో తేడాతో టీమిండియా ఓటమిపాలైంది. 21/0 ఓవర్‌ నైట్ స్కోర్‌తో చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. 82 ఓవర్లలో 5 వికెట్లకు 373 పరుగులు చేసి గెలుపొందింది. బెన్ డకెట్(170 బంతుల్లో 21 ఫోర్లు, సిక్స్‌తో 149) సెంచరీతో చెలరేగగా.. జాక్ క్రాలీ(126 బంతుల్లో 7 ఫోర్లతో 65), జోరూట్(84 బంతుల్లో 6 ఫోర్లతో 53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించారు.

ఈ ఇద్దరూ తొలి వికెట్‌కు 188 పరుగులు జోడించి భారత పతనాన్ని శాసించారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, ప్రసిధ్ కృష్ణ రెండేసి వికెట్లు తీయగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ పడగొట్టాడు. బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. ఈ గెలుపుతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో టెస్ట్ జూలై 2న బర్మింగ్‌హామ్ వేదికగా ప్రారంభం కానుంది. కీలక క్యాచ్‌లు వదిలేయడం టీమిండియా కొంపముంచింది. తొలి ఇన్నింగ్స్‌లో 5 క్యాచ్‌లు వదిలేసిన భారత ఆటగాళ్లు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఐదు క్యాచ్‌లు అందుకోలేకపోయారు. ఈ ఓటమితో యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్‌తో పాటు రిషభ్ పంత్ సాధించిన రెండు శతకాలు వృథా అయ్యాయి. ఈ మ్యాచ్‌తోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2027 ఎడిషన్ ప్రారంభమవ్వగా.. టీమిండియా ఓటమితో మొదలెట్టింది.

IND vs ENG Ben Duckett Joe Root Lead England to Victory Against India in First Test

దుమ్మురేపిన ఓపెనర్లు..

ఆఖరి రోజు ఆటలో ఇంగ్లండ్ ఓపెనర్లు బెన్ డకెట్, జాక్ క్రాలీ దుమ్మురేపారు. ఆరంభంలోనే బెన్ డకెట్ ఇచ్చిన క్యాచ్‌లను పంత్, బుమ్రా వదిలేసారు. ఈ అవకాశాలతో చెలరేగిన డకెట్ 66 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. బుమ్రాను కాస్త జాగ్రత్తగా ఆడిన ఈ ఓపెనింగ్ జోడీ.. మిగతా బౌలర్లను చెడుగుడు ఆడింది. తొలి సెషన్‌లో భారత బౌలర్లు తేలిపోయారు. దాంతో ఇంగ్లండ్ 117/0 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.

రెండో సెషన్‌లోనూ ఇంగ్లండ్ ఓపెనర్లు ఇదే జోరును కొనసాగించారు. 111 బంతుల్లో జాక్ క్రాలీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 97 పరుగుల వద్ద డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను జైస్వాల్ నేలపాలు చేశాడు. దాంతో అతను జడేజా వేసిన మరుసటి ఓవర్‌లో బౌండరీ బాది 121 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. ఆట తిరిగి ప్రారంభమైన తర్వాత జాక్ క్రాలీని ప్రసిద్ కృష్ణ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. అదే స్పెల్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఓలీ పోప్(8)ను క్లీన్ బౌల్డ్ చేశాడు.

గెలిపించిన జో రూట్

సెంచరీ హీరో బెన్ డకెట్‌తో పాటు హ్యారీ బ్రూక్(0)ను శార్దూల్ ఠాకూర్ వరుస బంతుల్లో పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత శిభిరంలో ఆశలు రెకెత్తాయి. కానీ జోరూట్, బెన్ స్టోక్స్ ఆచితూచి ఆడారు. దాంతో ఇంగ్లండ్ 269/4 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది. చివరి సెషన్‌‌లోనూ స్టోక్స్, జోరూట్ నిలకడగా ఆడారు. 49 పరుగుల భాగస్వామ్యంతో క్రీజులో సెట్ అయిన ఈ జోడీని జడేజా విడదీసాడు. స్టోక్స్(33)‌ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. క్రీజులోకి వచ్చిన జెమీ స్మిత్(44 నౌటౌట్), జో రూట్ అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశారు.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 465 పరుగులు చేయడంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం దక్కింది. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 364 పరుగులు చేసింది.

Story first published: Tuesday, June 24, 2025, 23:06 [IST]
Other articles published on Jun 24, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+