టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ నుంచి టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకున్నాడు. కుటుంబంలో తలెత్తిన మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్.. బీసీసీఐ అనుమతితో జట్టును వీడి చెన్నైకి బయల్దేరాడు. ఈ విషయాన్ని బీసీసీఐ ఎక్స్ వేదికగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అశ్విన్‌కు బోర్డు అండగా ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా అశ్విన్, అతడి కుటంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించవద్దని మీడియా, అభిమానులను బీసీసీఐ విజ్ఞప్తి చేసింది. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శ్రేయస్సు బోర్డుకు ఎంతో ముఖ్యమని చెప్పింది. ఈ కష్టకాలంలో అశ్విన్‌కు కావాల్సిన సహాయాన్ని అందిస్తామని పేర్కొంది.

ఈ మ్యాచ్‌లో ఇప్పటికే ఓ వికెట్ తీసిన అశ్విన్.. టెస్ట్‌ల్లో 500 వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్‌గా చరిత్రకెక్కాడు.
ఇక అశ్విన్ తల్లి ఆరోగ్యం విషమించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఎక్స్ వేదికగా వెల్లడించారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లికి దగ్గరగా ఉండటం కోసం అశ్విన్ చెన్నైకి వెళ్లాడని తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అశ్విన్ గైర్హాజరీ టీమిండియాకు తీరని నష్టం చేయనుంది.
ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మకు సవాల్‌గా మారనుంది. ఇప్పటికే ఫ్లాట్ వికెట్‌పై ఇంగ్లండ్ బజ్‌బాల్ బ్యాటింగ్‌తో దుమ్మురేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఒక బౌలర్ లేకుండా అందుబాటులో ఉన్న నలుగురితోనే బౌలింగ్ చేయించడం రోహిత్ కెప్టెన్సీకి సవాల్‌గా మారనుంది.
ఈ మ్యాచ్‌లో బెన్ డక్కెట్(118 బంతుల్లో 21 ఫోర్లు, 2 సిక్స్‌లతో 133 నాటౌట్) విధ్వంసకర శతకంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ 35 ఓవర్లలో 2 వికెట్లకు 207 పరుగులు చేసింది.
క్రీజులో బెన్ డక్కెట్‌తో పాటు జోరూట్(9 బ్యాటింగ్) ఉన్నాడు. జాక్ క్రాలీ(15), ఓలిపోప్(39) తర్వగా ఔటయ్యారు. భారత బౌలర్లలో అశ్విన్, సిరాజ్ తలో వికెట్ తీసారు. అంతకుముందు టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం ఇంగ్లండ్ 238 పరుగుల వెనుకంజలో ఉంది.