IND vs ENG: టీమిండియాలో కరోనా కలకలం.. నో బ్యాకప్ ప్లేయర్స్.. ఐసోలేషన్‌లోనే ఇద్దరు కీపర్లు!

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సమయం దగ్గరపడుతున్న వేళ టీమిండియాలో కరోనా కలకలం రేగింది. యువ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌తో పాటు త్రోడౌన్ స్పెషలిస్ట్ దయానంద్ గరానీ కరోనా పాజిటీవ్‌గా తేలారు. దాంతో వీరిద్దరిని ఐసోలేషన్‌లో ఉంచారు. అయితే దయానంద్‌కు సన్నిహితంగా ఉన్న మరో వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా, బ్యాట్స్‌మన్ అభిమన్యు ఈశ్వరన్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్‌ను కూడా ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ముగ్గురు కరోనా నెగటివ్‌గా తేలినప్పటికీ యూకే ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐసోలేషన్‌కు పంపారు. దాంతో టీమిండియాకు చెందిన ఐదుగురు సభ్యులు ప్రస్తుతం లండన్‌లో ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇక 20 రోజుల విశ్రాంతిని పూర్తి చేసుకున్న మిగతా జట్టు సభ్యులు డర్హమ్ బయలుదేరారు.

ఆటగాళ్లను పంపించలేం..
అయితే టీమిండియా స్పెషలిస్ట్ వికెట్ కీపర్లు ఇద్దరు ఐసోలేషన్‌లో ఉండటం టీమ్‌మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతుంది. కేఎల్ రాహుల్ రూపంలో మరో వికెట్ కీపర్ అందుబాటులో ఉన్నప్పటికీ అతను ఇప్పటి వరకు టెస్ట్‌ల్లో కీపింగ్ చేయలేదు. అయితే కరోనా నేపథ్యంలో బ్యాకప్‌గా మరికొంతమంది ఆటగాళ్లను పంపించే అవకాశమే లేదని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితులకు అనుగుణంగానే మొత్తం 20 మంది ప్లేయర్లతో పాటు నలుగురిని బ్యాకప్‌గా పంపించామన్నారు. పైగా ఇంగ్లండ్ ప్రయాణ ఆంక్షల మధ్య కొత్తగా ప్లేయర్స్‌ను పంపించడం కుదరదని స్పష్టం చేశాయి. ఆస్ట్రేలియా పర్యటనలో కూడా సీనియర్ ఆటగాళ్ల గాయాలైన సందర్భంలో యువ ఆటగాళ్లు సత్తా చాటారని, చిరస్మరణీయ విజయాన్నందించారని గుర్తు చేశాయి.

మూడు రోజుల వామప్ మ్యాచ్..
ఇంగ్లండ్ సిరీస్‌కు సన్నాహాకంగా బీసీసీఐ డర్హమ్‌లో ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా 20వ తేదీ నుంచి కౌంటీ ఎలెవన్ టీమ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. ఇంగ్లండ్‌లోని వివిధ కౌంటీ టీమ్స్ నుంచి ఈ మ్యాచ్‌కు 15 మంది ప్లేయర్లను ఎంపిక చేశారు. వార్విక్‌షైర్ కెప్టెన్ విల్ రోడ్స్ ఈ టీమ్‌కు నాయకత్వం వహించనున్నాడు. ఈ మూడు రోజుల వామప్ మ్యాచ్ పూర్తిగా ఖాళీ స్టేడియంలో జరగనుంది. పంత్, సాహా ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ కీపర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.

పంత్‌కు డెల్టా వేరియంట్..
ఇంగ్లండ్‌లో ఇటీవల డెల్టా వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతమున్న సమాచారం మేరకు రిషభ్ పంత్ కూడా ఈ డెల్టా బారిన పడినట్లు తెలుస్తోంది. ఇటీవల యూరో చాంపియన్‌షిప్ మ్యాచ్‌ను చూసొచ్చిన పంత్.. తేలికపాటి జ్వరంతో బాధపడ్డాడు. ఆ సమయంలో చేయించుకున్న పరీక్షల్లో అతనికి పాజిటీవ్ వచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పంత్ 9 రోజులుగా ఐసోలేషన్‌లో ఉన్నాడని బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా పేర్కొన్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications