ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ విజయం నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ ఫార్మాట్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఆటగాళ్లతో పాటు భారత టెస్ట్ టీమ్ ప్లేయర్ల జీతాలను పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. పెరిగిన మొత్తాన్ని బోనస్‌గా అందించాలనుకుంటుందని ఓ జాతీయ పత్రిక పేర్కొంది.
ప్రతీ సీజన్‌లో టెస్ట్ సిరీస్ ఆడే ఆటగాళ్లకు ఈ బోనస్ ఇవ్వాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో 5 టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ కైవసం చేసుకుంది. అయితే కొందరు ఆటగాళ్లు టెస్ట్ ఫార్మాట్‌ను లైట్ తీసుకుంటున్న నేపథ్యంలో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

టెస్ట్‌లకు దూరంగా యువ ప్లేయర్స్..:
దేశవాళీ ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీని కాదని ఐపీఎల్ 2024 సీజన్ కోసం ఆటగాళ్లు సిద్దమవుతుండటంపై బోర్డు ఆగ్రహంగా ఉంది. ఇప్పటికే ఆటగాళ్లందరికీ దేశవాళీ క్రికెట్ ఆడాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. కానీ కొందరు ఆటగాళ్లు ఈ ఆదేశాలను పట్టించుకోలేదు. టీమిండియా స్టార్ పేసర్ ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్‌లు.. రంజీ ట్రోఫీ ఆడకుండా ఐపీఎల్ కోసం సన్నదమవుతున్నారు.
జార్ఖండ్ టీమ్ తరఫున రంజీ ట్రోఫీ ఆడాలని టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సూచించినా.. ఇషాన్ కిషన్ పట్టించుకోలేదు. దాంతో అతన్ని ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరంగా ఉంచి ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇచ్చారు. అతను ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. మ్యాచ్ విన్నింగ్ నాక్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
రంజీలకు అయ్యర్, ఇషాన్ డుమ్మా..:
ముంబై ఇండియన్స్ తరఫున ఇషాన్ కిషన్.. కేకేఆర్ సారథిగా శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్ 2024 సీజన్ ఆడనున్నారు. టెస్ట్ ఆటగాళ్ల జీతాలు పెంచే విషయంపై బీసీసీఐ.. ఐపీఎల్ తర్వాత అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఓ టెస్ట్ మ్యాచ్‌కు భారత ఆటగాళ్లు రూ. 15 లక్షల మ్యాచ్ ఫీజు అందుకుంటున్నారు.
వన్డేల్లో రూ. 6 లక్షలు, టీ20ల్లో రూ. 3 లక్షల మ్యాచ్ ఫీజు తీసుకుంటున్నారు. ఇవి గాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ల ప్రకారం కోట్లలో వార్షిక వేతనం అందుకుంటున్నారు. బీసీసీఐ వార్షిక కాంట్రాక్టుల్లో నాలుగు గ్రేడ్‌లు ఉన్నాయి. మూడు ఫార్మాట్లు ఆడటంతో పాటు ఎక్స్‌ఫ్యాక్టర్ కలిగిన ఆటగాళ్లు గ్రేడ్ ఏలో చోటు దక్కించుకుంటారు. వీరికి ఏడాదికి రూ. 7 కోట్ల వార్షిక వేతనం అందుతోంది. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, జడేజా ఉన్నారు.
కోట్ల వేతనాలు..:
మూడు ఫార్మాట్లలో ఆడే ప్లేయర్లు గ్రేడ్ ఏలో చోటు దక్కించుకుంటారు. గ్రేడ్ ఏ ఆటగాళ్లకు ఏడాదికి రూ. 5 కోట్ల వేతనం దక్కనుంది. గ్రేడ్ బీలో రెండు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లు ఉంటారు. చతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్ ఉన్నారు. గ్రేబీ ఆటగాళ్లు రూ. 3 కోట్ల వార్షిక వేతనం అందుకుంటారు.
గ్రేడ్ సీలో అప్‌కమింగ్ ఆటగాళ్లు, ఒకే ఫార్మాట్‌లో కొనసాగే ప్లేయర్లు ఉంటారు. ఉమేశ్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, కేఎస్ భరత్‌లు ఉన్నారు. వీరికి రూ. కోటీ వార్షిక వేతనం అందనుంది. సీజన్ మొత్తం టెస్ట్ ఫార్మాట్ ఆడే ఆటగాళ్లకు గ్రేడ్ బీ లేదా గ్రేడ్ ఏలో అవకాశం కల్పించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.