టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌కు స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు చెప్పాడు. చాహల్ పేరిట ఉన్న అత్యధిక టీ20 వికెట్ల రికార్డ్‌ను అధిగమించినందుకు అర్ష్‌దీప్ సింగ్ క్షమాపణలు కోరాడు. తన రెండు చేతులను చెవులను పట్టుకొని మరి సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతా వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20లో అర్ష్‌దీప్ సింగ్(2/21) రెండు వికెట్లు పడగొట్టాడు. తొలి ఓవర్‌లోనే ఆ జట్టు ఓపెనర్ ఫిల్ సాల్ట్(0)ను పెవిలియన్ చేర్చిన అర్ష్‌దీప్ సింగ్.. తన మరుసటి ఓవర్‌లో మరో ఓపెనర్ బెన్ డకెట్(4)ను క్యాచ్ ఔట్ చేశాడు.

దాంతో అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత్ బౌలర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో చాహల్‌ను వెనక్కినెట్టాడు. 80 టీ20ల్లో యుజ్వేంద్ర చాహల్ 96 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్ 61 టీ20ల్లోనే 97 వికెట్లు తీసాడు. ఈ జాబితాలో అర్ష్‌దీప్ సింగ్(97), యుజ్వేంద్ర చాహల్(96) తర్వాత భువనేశ్వర్ కుమార్(87 టీ20ల్లో 90 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(71 టీ20ల్లో 89 వికెట్లు) కొనసాగుతున్నారు.
ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్ సింగ్ మరో 3 వికెట్లు తీస్తే టీ20ల్లో 100 వికెట్ల మైలు రాయి అందుకున్న తొలి బౌలర్‌గా చరిత్రకెక్కనున్నాడు. 2022లోనే అంతర్జాతీయ టీ20ల్లోకి అరంగేట్రం చేసిన అర్ష్‌దీప్ సింగ్ రెండేళ్ల వ్యవధిలోనే 100 వికెట్ల మైలురాయికి చేరువయ్యాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఈ మ్యాచ్ అనంతరం బీసీసీఐ టీవీతో మాట్లాడిన అర్ష్‌దీప్ సింగ్.. రికార్డ్ బ్రేక్ చేసినందుకు చాహల్‌కు క్షమాపణలు చెప్పాడు. 'టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డ్ సాధించినందుకు సంతోషంగా ఉంది. నా కష్టానికి ప్రతిఫలం దక్కినందుకు కృతజ్ఞుడిని. దేశం కోసం వికెట్లను తీస్తూనే ఉండేందుకు ప్రయత్నిస్తాను.'అని అర్ష్‌దీప్ సింగ్ చెప్పుకొచ్చాడు.
తొలి టీ20లో అసాధారణ ప్రదర్శన కనబర్చిన వరుణ్ చక్రవర్తీపై అర్ష్‌దీప్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. 'వరుణ్ అసాధారణంగా బౌలింగ్ చేస్తున్నాడు. టీ20ల్లో మిడిల్ ఓవర్లలో వికెట్లు తీయడం చాలా కీలకం. మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు ఔటవ్వకుంటే తర్వాత దూకుడుగా ఆడుతారు.
అప్పుడు డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడం కష్టమవుతోంది. వరుణ్ జట్టులోకి వచ్చినప్పటి నుంచి మిడిల్ ఓవర్లలో చాలా వికెట్లు తీసాడు. తన అద్భుత బౌలింగ్‌తో డెత్ ఓవర్ల బౌలింగ్‌ను సులువు చేస్తున్నాడు. అతను ఇదే జోరును కొనసాగిస్తాడని ఆశిస్తున్నా.'అని వరుణ్ చక్రవర్తీ చెప్పుకొచ్చాడు.