మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లు ఉంది టీమిండియా పరిస్థితి. అసలే ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో 1-2తో వెనుకంజలో ఉన్న టీమిండియాను గాయాల బెడద వేధిస్తోంది. ఇప్పటికే అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా ఈ జాబితాలోకి తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చేరాడు. నాలుగో టెస్ట్‌కు ముందు నితీష్ రెడ్డి జిమ్ చేస్తూ గాయపడ్డాడు.
అతని లిగమెంట్ దెబ్బ తిన్నట్లు స్కానింగ్‌లో తేలిందని బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ గాయంతో తదుపరి రెండు టెస్ట్‌లకు నితీష్ కుమార్ రెడ్డి దూరమవుతాడని తెలిపింది. ఈ సిరీస్‌లో రెండు టెస్ట్‌లు ఆడిన నితీష్.. 45 పరుగులు చేసి మూడు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. బుధవారం నుంచి మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్ట్ ప్రారంభం కానుండగా.. ఆకాశ్ దీప్, అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు నితీష్ కూడా గాయపడటం టీమిండియాకు ఎదురు దెబ్బే అని చెప్పొచ్చు.

అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్ గాయాల నేపథ్యంలో హరియాణా పేసర్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ అన్జుల్ కాంబోజ్‌ను జట్టులోకి తీసుకున్నారు. ముందు జాగ్రత్తగా సెలెక్టర్లు అన్షుల్‌ను ఎంపిక చేశారు. ఇంగ్లండ్‌తో రెండో, మూడో టెస్ట్ ఆడిన ఆకాశ్ దీప్.. గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. నెట్ సెషన్‌లో సాయి సుదర్శన్ షాట్‌ను ఆపే ప్రయత్నంలో అర్ష్‌దీప్ సింగ్ గాయపడ్డాడు. అతని ఎడమ చేతికి బలమైన గాయమైంది. అర్ష్‌దీప్ సింగ్ ఇప్పటి వరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. నాలుగో టెస్ట్‌తో అరంగేట్రం చేస్తాడని భావించిగా.. గాయంతో జట్టుకు దూరమయ్యే పరిస్థితిని తెచ్చుకున్నాడు.
24 ఏళ్ల అన్షుల్ కాంబోజ్.. భారత్ ఏ తరఫున మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. గతేడాది జరిగిన రంజీ ట్రోఫీలో కేరళతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. తద్వారా రంజీల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. గతంలో ప్రేమాంగ్సు ఛటర్జీ(1956-57), ప్రదీప్ సోమసుందరం(1985-86) ఈ ఫీట్ సాధించారు. గత రంజీ సీజన్‌లో 6 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ 34 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున మెరుగైన ప్రదర్శన చేశాడు. 8 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు పడగొట్టాడు.