దేశవాళీ క్రికెట్‌లో సత్తా చాటి తొలి సారి టీమిండియా పిలుపును అందుకున్న బెంగాల్ పేసర్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) క్రికెటర్ ఆకాశ్ దీప్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేయనున్నాడు. సంచలన ప్రదర్శనతో భారత టెస్ట్ టీమ్‌లోకి వచ్చిన అతనికి.. రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగే నాలుగో టెస్ట్‌లో అవకాశం దక్కనుంది.
శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న ఈ మ్యాచ్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా బుమ్రాకు టీమ్‌మేనేజ్‌మెంట్ విశ్రాంతినిచ్చింది. అతని స్థానంలో ఆకాశ్‌దీప్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అతనికి ముకేష్ కుమార్ నుంచి పోటీ ఎదురు కానున్నా... టీమిండియా మేనేజ్‌మెంట్ ఆకాశ్‌దీప్ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఓ జాతీయ చానెల్ పేర్కొంది.

ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో భారత్ ఏ తరఫున ఆకాశ్ దీప్ రాణించిన తీరు పట్ల టీమిండియా మేనేజ్‌మెంట్ సంతృప్తిగా ఉందంట. భారత్ ఏ తరఫున ఆకాశ్ దీప్ 11 వికెట్లు తీసాడు. మరోవైపు ముకేష్ కుమార్ సైతం బిహార్‌తో జరిగిన రంజీ మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. అయితే వైజాగ్ టెస్ట్‌లో మాత్రం ముకేష్ కుమార్ తేలిపోయాడు. ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు.
కేవలం ఒకే ఒక్క వికెట్ తీసాడు. మరోవైపు బుమ్రా 9 వికెట్లతో సత్తా చాటాడు. అంతేకాకుండా రివర్స్ స్వింగ్ రాబట్టడంలో ఆకాశ్ దీప్ దిట్ట. ఇప్పటి వరకు అతను 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 23.58 యావరేజ్‌తో 104 వికెట్లు తీసాడు. ఒకవేళ ఆకాశ్ దీప్.. నాలుగో టెస్ట్‌లో బరిలోకి దిగితే.. ఈ సిరీస్‌లో మూడో అరంగేట్ర భారత ప్లేయర్‌గా నిలుస్తాడు.
ఇప్పటికే సర్ఫరాజ్ ఖాన్, రజత్ పటీదార్, ధ్రువ్ జురెల్ ఈ సిరీస్‌లోనే అరంగేట్రం చేశారు. రజత్ పటీదార్ మినహా ధ్రువ్ జురెల్, రజత్ పటీదార్ సత్తా చాటారు. ప్రస్తుతం ఈ సిరీస్‌లో భారత్ 2-1తో ఆధిక్యంలో ఉంది. రాంచీ టెస్ట్‌లో విజయం సాధించి 3-1తో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది. మరోవైపు ఇంగ్లండ్ ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్ డిసైడర్‌కు దారివ్వాలనే పట్టుదలతో ఉంది.