ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్‌లో భారత బౌలర్లు దుమ్మురేపుతున్నారు. తొలి ఇన్నింగ్స్ తరహాలోనే ఇంగ్లండ్ బ్యాటర్లపై ఆధిపత్యం చెలాయిస్తున్నారు. దాంతో నాలుగో రోజు ఆట ఆరంభంలోనే ఇంగ్లండ్ కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయింది. మహమ్మద్ సిరాజ్ సంచలన బౌలింగ్‌తో టీమిండియాకు శుభారంభం అందిస్తే.. నితీష్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ ఆ జోరును కొనసాగించారు. బెన్ డకెట్(12), ఓలీ పోప్(4)లను సిరాజ్ పెవిలియన్ చేర్చితే జాక్ క్రాలీ(22)ని నితీష్ కుమార్ రెడ్డి ఔట్ చేశాడు. హ్యారీ బ్రూక్(23)ను ఆకాశ్ దీప్ క్లీన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది.
ఆకాశ్ దీప్ బంతికి హ్యారీ బ్రూక్ బిత్తరపోయాడు. అతని బౌలింగ్ ధాటికి హ్యారీ బ్రూక్ మిడిల్ స్టంప్ ఎగిరి పడింది. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఆకాశ్ దీప్ వేసిన 22వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని హ్యారీ బ్రూక్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతిని అంచనా వేయడంలో అతను విఫలమవ్వడంతో బ్యాట్‌ను మిస్సైన బంతి మిడిల్ స్టంప్‌ను లేపేసింది.

ఈ వికెట్ తీసిన అనంతరం ఆకాశ్ దీప్ గట్టిగా అరుస్తూ సంబరాలు చేసుకున్నాడు. క్రీజులోకి వచ్చిన బెన్ స్టోక్స్‌తో కలిసి జోరూట్ మరో వికెట్ పడకుండా తొలి సెషన్‌ను ముగించాడు. దాంతో 2/0 ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్ లంచ్ బ్రేక్ సమయానికి 4 వికెట్లకు 98 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. అనంతరం భారత్ కూడా 387 పరుగులే చేసింది. దాంతో ఏ జట్టుకు ఆధిక్యం దక్కలేదు.