అదృష్టం తలుపు తట్టే లోపే దురదృష్టం వెక్కిరించినట్లుంది టీమిండియా అరంగేట్ర పేసర్ ఆకాశ్ దీప్ పరిస్థితి. ఇంగ్లండ్‌తో రాంచీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆకాశ్ దీప్.. తన రెండో ఓవర్‌లోనే స్టన్నింగ్ డెలివరీతో జాక్ క్రాలీని క్లీన్ బౌల్డ్ చేశాడు. సూపర్బ్ ఇన్‌స్వింగర్‌తో ఆఫ్‌స్టంప్‌ను లేపేసాడు.
ఈ స్టన్నింగ్ డెలివరీకి జాక్‌క్రాలీ సైతం బిత్తరపోయాడు. అరంగేట్ర వికెట్ తీసిన ఆనందంలో ఆకాశ్ దీప్ ఎగిరి గంతేసాడు. కానీ సెకను వ్యవధిలోనే ఆ ఆనందం ఆవిరైంది. నోబాల్ సైరన్ మోగడంతో అంతా షాకయ్యారు. వికెట్ తీసిన బంతిని అంపైర్ నోబాల్‌గా ప్రకటించడంతో జాక్ క్రాలీ ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు.

దాంతో ఆకాశ్ దీప్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. ప్రస్తుతం ఈ వికెట్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. నెటిజన్లు.. అయ్యో ఆకాశ్ దీప్ అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. 4 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లభించిన లైఫ్‌తో జాక్ క్రాలీ చెలరేగుతున్నాడు. బెన్ డక్కెట్ కాస్త నిదానంగా ఆడుతున్నా.. జాక్ క్రాలీ(32 బ్యాటింగ్) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. దాంతో ఇంగ్లండ్ 8 ఓవర్లలో 39 పరుగులు చేసింది.
వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌లో భాగంగా జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వడంతో ఆకాశ్ దీప్‌కు ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కింది. ముకేష్ కుమార్‌తో అతనికి పోటీ నెలకొన్నా.. టీమిండియా మేనేజ్‌మెంట్ ఆకాశ్‌దీప్ వైపే మొగ్గు చూపింది. వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ.. బ్రేక్ త్రూ అందించే ప్రయత్నం అతను చేసినా దురదృష్టం వెంటాడింది.