IND vs ENG: ఆస్ట్రేలియాలో బాగా ఆడినా.. ఇంగ్లండ్‌లో విరాట్ కోహ్లీ అందుకే విఫలమవుతున్నాడు: జావెద్

ఇస్లామాబాద్: టీమిండియా కెప్టెన్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన సుదీర్ఘ కెరీర్లోనే ఎన్నడూ లేనంతగా ప్రస్తుతం ఇబ్బంది పడుతున్నాడు. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు అలవోకగా సాధించే కోహ్లీ.. గత 20-22 నెలలుగా ఒక్క సెంచరీ కూడా చేయలేదు. టీ20, వన్డేల్లో పర్వాలేదన్పిస్తున్నా.. టెస్ట్ ఫార్మాట్‌లో మాత్రం అంచనాలను అందుకోలేకపోతున్నాడు.
ఇటీవలి కాలంలో హాఫ్ సెంచరీ చేయడమే అతడికి గగనం అయిపొయింది. కోహ్లీ బ్యాటింగ్ సగటు కూడా రోజురోజుకు పడిపోతుండటం అభిమానులను కలవరపెడుతోంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీసుల్లోనైనా గాడిలో పడతాడనుకుంటే.. అది జరగలేదు. దీంతో కోహ్లీపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

బంతి స్వింగ్ లేదా సీమ్ అయినపుడు
విరాట్ కోహ్లీ టెస్టుల్లో తన స్థాయికి దగ్గ ఇన్నింగ్స్ ఆడి ఎంతో కాలమైంది. శతకం బాది దాదాపుగా రెండేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ అతడు భారీ స్కోర్లు చేయలేకపోతున్నాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 5 ఇన్నింగ్స్‌ల్లో 24.80 సగటుతో 124 పరుగులు మాత్రమే చేశాడు.
ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ తీరుపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ అకిబ్ జావెద్ స్పందించాడు. 'ఆసియాలో విరాట్ కోహ్లీ విలక్షణమైన ఆటగాడు. ఇతడు ఆస్ట్రేలియాలో కూడా బాగా ఆడగలడు. కానీ ఇంగ్లండ్, దక్షిణఫ్రికా వంటి దేశాల్లో బంతి స్వింగ్ లేదా సీమ్ అయినపుడు ఇబ్బంది పడుతున్నాడు. అవుట్ స్వింగర్లను అతడు బాదుతాడు' అని జావెద్ అన్నాడు.

ఎలా ఆడాలో రూట్‌కి తెలుసు
ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ సత్తాచాటుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు జరిగిన మూడు టెస్టుల్లో క్రీజులో పాతుకుపోయి భారీ స్కోర్లు సాధించాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా 507 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు ఉండడం గమనార్హం. 2021లో ఇంగ్లీష్ కెప్టెన్ 1398 పరుగులు చేశాడు. దీంతో రూట్ బ్యాటింగ్ తీరును విరాట్ కోహ్లీతో అకిబ్ జావెద్ పోల్చాడు.
'ఇంగ్లండ్‌లోని కఠినమైన పిచ్‌లపై బంతిని ఆలస్యంగా ఎలా ఆడాలో జో రూట్‌కి బాగా తెలుసు. ఆ టెక్నిక్ అతడిని కాపాడుతోంది. విరాట్ కోహ్లీ ఇది చేయలేకపోతున్నాడు. ఇక్కడే అతడు విఫలమవుతున్నాడు' అని జావెద్ అసలు విషయం చెప్పుకొచ్చాడు.

2014లో ఇదే తీరు
2014లో తొలిసారి ఇంగ్లండ్ గడ్డపై ఆడిన విరాట్ కోహ్లీ ఆ పర్యటనలో దారుణంగా విఫలమయ్యాడు. 5 టెస్ట్‌ల్లో కేవలం 134 రన్స్ మాత్రమే చేశాడు. జేమ్స్ అండర్సన్ ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులకు ఎక్కువగా ఔటయ్యాడు. కానీ 2018 పర్యటనలో మాత్రం పరుగుల వరద పారించాడు. 5 టెస్ట్‌ల్లో 59.30 సగటుతో 593 రన్స్ చేశాడు.
ఇందులో 2 సెంచరీలు కూడా ఉన్నాయి. అయితే 2021 పర్యటనలో మరోసారి విఫలమవుతున్నాడు. ఇప్పటికే ముగిసిన మూడు టెస్టులో చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. ఇంకా రెండు టెస్టులు ఉన్న నేపథ్యంలో కోహ్లీ గాడిలో పడుతాడేమో చూడాలి. సెంచరీల కరువు తీర్చుకుంటాడో లేదో చూడాలి.

70 సెంచరీలు.. 23 వేల పరుగులు
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 95 టెస్టులాడి 51.01 సగటుతో 7671 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 26 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 పరుగులు చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 23 వేల పరుగులు చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
స్టార్ ప్లేయర్స్ ఔట్.. బిల్లింగ్స్, వోక్స్ రీ ఎంట్రీ! నాలుగో టెస్టులో బరిలోకి దిగే ఇంగ్లండ్ జట్టు ఇదే!!