Hyderabad Test: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ మధ్య ఉప్పల్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఓవైపు మ్యాచ్ రసవత్తరంగా సాగుతుండగా.. మరోవైపు ఓ అభిమాని సెక్యూరిటీ కళ్లు గప్పి మైదానంలోకి దూసుకొచ్చాడు. నేరుగా రోహిత్ శర్మ దగ్గరకు వెళ్లిన సదరు అభిమాని.. అతన్ని కాళ్లు మొక్కాడు.
అనంతరం హిట్‌మ్యాన్‌ను కౌగిలించుకునే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే అప్రమత్తమైన ఉప్పల్ మైదాన సిబ్బంది సదరు అభిమానిని బయటకు లాక్కెళ్లారు. గురువారం తొలి రోజు ఆటలో భారత తొలి ఇన్నింగ్స్ ప్రారంభానికి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు అభిమానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. స్టేడియం బయటకు పంపించారు.

ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కొసమెరుపు ఏంటంటే.. సదరు అభిమాని విరాట్ కోహ్లీ పేరుతో ఉన్నజెర్సీ ధరించాడు. ఒకవేళ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడి ఉంటే.. ఏం చేసేవాడోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కొందరైతే 'రోహిత్ శర్మ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని' పోస్ట్ చేస్తున్నారు.
కోహ్లీ, రోహిత్ అభిమానులు వేర్వేరు కాదని, ఇద్దరూ ఆటను అభిమానిస్తారనడానికి ఈ ఘటన నిదర్శనమని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలంటూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే అభిమానులు ఈ వీడియోను చూసి మారాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 64.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ బెన్ స్టోక్స్(88 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70) హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేయగా.. జానీ బెయిర్‌స్టో(58 బంతుల్లో 5 ఫోర్లతో 37), బెన్ డకెట్(39 బంతుల్లో 7 ఫోర్లతో 35) పర్వాలేదనిపించారు.
భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(3/88), అశ్విన్(3/68) మూడేసి వికెట్లు తీయగా... అక్షర్ పటేల్(2/33), జస్‌ప్రీత్ బుమ్రా(2/28) రెండేసి వికెట్లు పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ ధాటిగా తమ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. యశస్వి జైస్వాల్ వన్డే తరహా బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. దాంతో 8 ఓవర్లలోనే టీమిండియా వికెట్ నష్టపోకుండా 56 పరుగులు చేసింది. క్రీజులో యశస్వి జైస్వాల్(39 బ్యాటింగ్), రోహిత్ శర్మ(13 బ్యాటింగ్) ఉన్నారు.