ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియాకు భారీ ఆధిక్యం లభించింది. రెండో రోజు ఆటలోనూ రోహిత్ సేన పూర్తి ఆధిపత్యం చెలాయించింది. భారత టాప్-5 బ్యాటర్లు సత్తా చాటడంతో ఇంగ్లండ్ బౌలర్లు తేలిపోయారు. దాంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 120 ఓవర్లలో 8 వికెట్లకు 473 పరుగులు చేసింది.
రోహిత్ శర్మ(162 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 103), శుభ్‌మన్ గిల్(150 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 110) సెంచరీలతో చెలరేగగా.. దేవదత్ పడిక్కల్(65), సర్ఫరాజ్ ఖాన్(56) హాఫ్ సెంచరీలతో రాణించారు. క్రీజులో కుల్దీప్ యాదవ్(27 బ్యాటింగ్)తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా(19 బ్యాటింగ్) ఉన్నారు.

ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్(4/170) నాలుగు వికెట్లు తీయగా.. టామ్ హార్ట్‌లీ రెండు వికెట్లు తీసాడు. జేమ్స్ అండర్సన్, బెన్ స్టోక్స్‌లకు తలో వికెట్ దక్కింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్లు, రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లతో చెలరేగారు.
ఇంగ్లండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ (79)మినహా అంతా విఫలమయ్యారు. ప్రస్తుతం భారత్ ఆధిక్యం 255 పరుగులకు చేరింది. మూడో రోజు ఆటలో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ మాదిరే విఫలమైతే.. భారత్‌కు భారీ విజయం దక్కే అవకాశం ఉంది.
రోహిత్, గిల్ సెంచరీ..
135/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఓవర్‌నైట్ బ్యాటర్లు రోహిత్, శుభ్‌మన్ గిల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. ఇంగ్లండ్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ పోటాపోటీగా పరుగులు చేసింది. 154 బంతుల్లో రోహిత్.. 137 బంతుల్లో శుభ్‌మన్ గిల్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దాంతో భారత్ 264/1 స్కోర్‌తో లంచ్ బ్రేక్‌కు వెళ్లింది.
చెలరేగిన సర్ఫరాజ్..
సెకండ్ సెషన్ ఆరంభంలోనే బంతిని అందుకున్న స్టోక్స్ ఫస్ట్ బాల్‌కే రోహిత్ శర్మను క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ కొద్ది సేపటికే శుభ్‌మన్ గిల్ కూడా జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన అరంగేట్ర ప్లేయర్ దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్ ఆచితూచి ఆడారు. క్రీజులో సెట్ అయ్యేందుకు కాస్త టైమ్ తీసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. మార్క్‌వుడ్ స్లెడ్జింగ్‌తో బ్యాట్‌కు పని చెప్పాడు.
భారీ షాట్లతో వేగంగా పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతను 55 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దాంతో భారత్ 376/3 స్కోర్‌తో టీ బ్రేక్‌కు వెళ్లింది.
పడిక్కల్ హాఫ్ సెంచరీ..
మూడో సెషన్ ఆరంభంలోనే దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్‌ఖాన్‌కు షోయబ్ బషీర్ కళ్లేం వేసాడు. క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో నాలుగో వికెట్‌కు నమోదైన 97 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజలోకి వచ్చిన ధ్రువ్ జురెల్ సాయంతో పడిక్కల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారీ సిక్సర్‌తో అతను హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు.
సెంచరీ దిశగా సాగిన పడిక్కల్‌ను బషీర్ ఔట్ చేయగా.. ధ్రువ్ జురెల్(15) కూడా అతని బౌలింగ్‌లోనే క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. రవీద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లను టామ్ హార్ట్‌లీ పెవిలియన్ చేర్చాడు. దాంతో భారత్ ఇన్నింగ్స్ ముగుస్తుందని అంతా భావించారు. కానీ కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ బౌలర్ల సహనానికి పరీక్షగా నిలిచారు.
ఈ ఇద్దరూ 9వ వికెట్‌కు 45 పరుగులు జోడించి రెండో రోజు ఆటను ముగించారు.