IND VS ENG 5th Test: అప్పుడు ఇంగ్లండ్ చేసిన పనిని భారత్ ఏమాత్రం మరవొద్దు.. దాడులు జరిగినా..: గవాస్కర్

ముంబై; భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరగనున్న చివరి టెస్ట్ ఈ రోజు ప్రారంభానికి కొన్ని గంటల ముందు రద్దయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడా మ్యాచ్ రీషెడ్యూల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌ను రీషెడ్యూల్ చేయడానికి ఈసీబీతో బీసీసీఐ చర్చిస్తోంది. ఈసీబీతో బీసీసీఐకి మంచి సంబంధాలు ఉండటంతో.. ఈ రద్దయిన మ్యాచ్‌ను మళ్లీ నిర్వహించే అంశంపై రెండు బోర్డులు చర్చిస్తున్నాయి. సరైన విండో కోసం చూస్తున్నాయి. వచ్చే ఏడాది టీ20, వన్డే సిరీస్ కోసం టీమిండియా మళ్లీ ఇంగ్లండ్ వెళ్లనుంది.
అప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రద్దైన ఐదో టెస్టును రీషెడ్యూల్ చేయాలనే బీసీసీఐ ప్రతిపాదనను భారత దిగ్గజం, ప్రముఖ వ్యాఖ్యాత సునీల్ గవాస్కర్ స్వాగతించాడు. 2008 దాడులను ఓ ఉదాహరణగా చూపాడు.

భారత్‌కు తిరిగొచ్చిన ఇంగ్లండ్
2008లో ముంబైలో దాడులు ప్రారంభమైన రోజున (నవంబర్ 26) కటక్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య వన్డే మ్యాచ్ ఉంది. దాడుల కారణంగా 7మ్యాచ్‌ల సిరీస్‌లోని చివరి రెండు వన్డేలను రద్దు చేశారు. దాంతో ఇంగ్లండ్ క్రికెటర్లు స్వదేశానికి వెళ్లిపోయారు. దాడుల నేపథ్యంలో ఆ తర్వాత జరగాల్సిన 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై సందిగ్ధత నెలకొంది.
అయితే టెస్టు సిరీస్ ఆడటానికి మళ్లీ భారత్‌కు తిరిగొచ్చింది ఇంగ్లీష్ జట్టు. తొలుత అనుకున్న షెడ్యూల్ ప్రకారం అహ్మదాబాద్, ముంబైలో కాకుండా అహ్మదాబాద్, చెన్నైలలో మ్యాచులు జరిగాయి. ఈ సిరీస్‌లో కెవిన్ పీటర్సన్ నేతృత్వంలోని ఇంగ్లీష్ జట్టు భారత్ చేతిలో 1-0తో టెస్ట్ సిరీస్ కోల్పోయింది.

భారత్ మర్చిపోకూడదు
ఆ విషయాన్ని సునీల్ గవాస్కర్ గుర్తుచేస్తూ.. 2008లో ఇంగ్లండ్ చూపిన సానుకూల ధోరణిని మరచిపోకూడదని చెప్పాడు. ఉగ్రదాడి తర్వాత టెస్టు సిరీస్ కోసం ఇంగ్లీష్ జట్టు మళ్లీ భారత్‌కు వచ్చిందని, ఇప్పుడు మనం కూడా అందుకు కృతజ్ఞత చూపించాలన్నాడు. సన్నీ తాజాగా సోనీ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ... 'రద్దయిన టెస్టును రీషెడ్యూల్ చేయడం సరైన నిర్ణయం అని నేను అనుకుంటున్నాను.
26/11 దాడి తర్వాత ఇంగ్లండ్ చేసిన పనిని భారత్ మర్చిపోకూడదు. వారు మళ్లీ తిరిగొచ్చారు. "భారత్‌లో భద్రత ఉంటుందని భావించడం లేదు. అందుకే మేము అక్కడికి రాము" అని చెప్పే పూర్తి హక్కు ఆరోజు ఇంగ్లండ్‌కు ఉంది. కానీ వారు అలా అనలేదు' అని తెలిపాడు.
IND VS ENG 5th Test: ఐదో టెస్టుపై వచ్చిన స్పష్టత.. బీసీసీఐ సెక్రటరీ ఏం చెప్పాడంటే?

పీటర్సన్ ప్రధాన కారణం
'2008లో కెవిన్ పీటర్సన్ జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ విషయాన్ని ఎవరూ మర్చిపోవద్దు. ఇంగ్లండ్ జట్టు మళ్లీ రావడానికి అతడే ప్రధాన కారణం. ఆ రోజు నాకు భారత్ వెళ్లడం ఇష్టం లేదని కేపీ ఒక్క మాట అంటే.. అక్కడే సిరీస్ ముగిసేది. కానీ అతడు అలా అనలేదు. అందరిని ఒప్పించాడు. దాంతో చెన్నైలో అద్భుతమైన టెస్ట్ మ్యాచ్ జరిగింది. చివరి రోజున భారత్ 380 పరుగులను ఛేజ్ చేసి విజయం సాధించింది. ఆనాడు ఇంగ్లండ్ చేసిన పనిని భారత్ ఏమాత్రం మరవొద్దు' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. సన్నీ భారత్ తరఫున 125 టెస్టులు, 108 వన్డేలు ఆడాడు.

ఇపుడే చెప్పడం మంచిది
వచ్చే ఏడాది మ్యాచ్ ఆడుతామని బీసీసీఐ ఇపుడే చెప్పడం సరైందని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 2022 తరవాత భారత్ ఎలాగూ ఇంగ్లండ్ వెళ్లనుందని, సమయం చూసుకుని ఈ టెస్ట్ మ్యాచ్ ఆడితే సరిపోతుందన్నాడు. వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత్‌తో 3 వన్డేలు, 3 టీ20లు షెడ్యూల్‌ను ఈసీబీ షెడ్యూల్ చేసింది. జూన్‌లో ఆరంభంలో ఐపీఎల్ ముగిశాక కొద్ది రోజులు ముందుగానే ఇంగ్లండ్ వెళ్లి.. షెడ్యూల్‌కు ముందుగానీ, తర్వాత గానీ టెస్టు ఆడవచ్చని సన్నీ సూచించాడు. ఇలా అయితే బోర్డుల మధ్య మంచి బంధాలు ఉంటాయన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications