ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్‌లో బరిలో దిగే టీమిండియా కాంబినేషన్‌పై కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పిచ్ కండిషన్స్ నేపథ్యంలో ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పాడు. తుది జట్టు ఎంపిక ఇంకా ఖరారు కాలేదని, మ్యాచ్ ప్రారంభానికి ముందు చివరగా పిచ్ ఔట్ లుక్ చూసి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు.
ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను 3-1తో గెలుచుకున్న టీమిండియా.. ధర్మశాల వేదికగా గురువారం నుంచి ప్రారంభం కానున్న ఆఖరి పోరుకు సిద్దమైంది. విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో బుధవారం మీడియా సమావేశంలో పాల్గొన్న రోహిత్ శర్మ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఓపికగా బదులిచ్చాడు. కెరీర్‌లో 100 టెస్ట్ ఆడబోతున్న టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. అతను తమ మ్యాచ్ విన్నర్ అని కొనియాడాడు.
'రవిచంద్రన్ అశ్విన్ 100 టెస్ట్‌ల మైలురాయి అందుకోవడం గొప్ప ఘనత. సుదీర్ఘ కాలంగా అతను మా మ్యాచ్ విన్నర్. అనేక సిరీస్‌ల్లో అసాధారణ ప్రదర్శనతో భారత్‌కు విజయాలు అందించాడు. అతనితో కలిసి నేను అండర్ 19 క్రికెట్ ఆడాను. అప్పుడు అతను ఓపెనర్‌గా బరిలోకి దిగితే.. నేను బౌలింగ్ చేసేవాడిని. ఇప్పుడు నేను ఓపెనర్‌గా ఆడుతుంటే అతను బౌలింగ్ చేస్తున్నాడు.
మైదానంలో అతను సాధించిన ఘనతల వెనుక ఎంతో కష్టం ఉంది. మైదానంలోకి అడుగుపెట్టేముందు అతను నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తాడు. గంటలకొద్దీ బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తాడు. అతను నెట్స్‌లో బౌలింగ్ చేయడం నేను రెగ్యులర్‌గా చూస్తాను. అతనో బిగ్ మ్యాచ్ ప్లేయర్.
రాజ్‌కోట్ టెస్ట్‌లోనే అతను ఏంటో మనమంతా చూశాం. మ్యాచ్ మధ్యలో దూరమైన అతను మళ్లీ జట్టుతో కలుస్తానని చెప్పి వచ్చాడు. రావడమే కాకుండా ఓ వికెట్ కూడా తీసాడు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.
టీమ్ కాంబినేషన్ గురించి ప్రశ్నించగా.. ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగుతున్నట్లు హింట్ ఇచ్చాడు. ధర్మశాల పిచ్ పేస్ అనుకూలమా..? ర్యాంక్ టర్నరా? అనే చర్చ అనవసరం. పిచ్ ఎలా ఉన్నా మ్యాచ్ గెలవడమే మా ప్రధాన ఉద్దేశం. ర్యాంక్ టర్నర్ పిచ్ సిద్దం చేసినా.. ఇరు జట్లకు సమాన అవకాశాలు ఉంటాయి.
ధర్మశాలలో నేను ఇప్పటి వరకు టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. జట్టులో ఉన్న ఇద్దరూ స్పిన్నర్లు, పేసర్లకు మాత్రం ఇక్కడ ఆడిన అనుభవం ఉంది. వారు 2017లో ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఆడారు. పిచ్ మాత్రం చూడటానికి మంచి వికెట్‌లానే కనబడుతోంది.
భారత్ తరహా పిచ్‌లానే ఆరంభంలో స్వింగ్ అయ్యి.. తర్వాత స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉంది.
ఈ మ్యాచ్‌లో మేం ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగే అవకాశం ఉంది. అయితే ఇంకా తుది జట్టును ఖరారు చేయలేదు.'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఎక్స్‌ట్రా పేసర్‌తో బరిలోకి దిగితే ఆకాశ్ దీప్ జట్టులో కొనసాగుతాడు. ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకుంటే మాత్రం ఆకాశ్ దీప్‌పై వేటు పడుతోంది. కుల్దీప్ యాదవ్ జట్టులోకి వస్తాడు.