టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్‌పై క్రికెట్ అభిమానులు, విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లండ్‌తో ఐదో టెస్ట్‌లో టీమిండియా ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగడంపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. గురువారం లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ప్రారంభమైన ఆఖరి టెస్ట్‌లో టీమిండియా నాలుగు మార్పులతో బరిలోకి దిగింది.
గాయంతో జట్టుకు దూరమైన వికెట్ కీపర్ రిషభ్ పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ బరిలోకి దిగగా.. జస్‌ప్రీత్ బుమ్రా ప్లేస్‌లో ప్రసిధ్ కృష్, అన్షుల్ కంబోజ్ స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వచ్చారు. ఆశ్చర్యకరంగా పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ స్థానంలో కరుణ్ నాయర్‌ను తీసుకున్నారు. దాంతో టీమిండియా ముగ్గురు పేసర్లతోనే బరిలోకి దిగింది. బ్యాటింగ్ డెప్త్ కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సందర్భంగా టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు.

అయితే ఈ నిర్ణయాన్ని అభిమానులు, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. బ్యాటింగ్ డెప్త్ కోసం బౌలింగ్ విభాగాన్ని బలహీనం చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. బుమ్రా గైర్హాజరీలో ముగ్గురు పేసర్లతోనే టీమిండియా ఎలా రాణిస్తుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ ఒక్క స్పిన్నర్ లేకుండా నలుగురు స్పెషలిస్ట్ పేసర్లతోనే బరిలోకి దిగిందంటేనే.. ఈ పిచ్ పేస్‌కు అనుకూలంగా ఉంటుందనే విషయం అర్థమవుతుందంటున్నారు. నాలుగో టెస్ట్‌లో కరుణ్ నాయర్ విఫలమైనా.. బంతితో కొన్ని ఓవర్లు బౌలింగ్ చేసాడనే విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేస్తున్నారు.
శార్దూల్ ఠాకూర్ లేకపోవడం వల్ల భారత పేసర్లపై అదనపు భారం పడుతుందని హెచ్చరిస్తున్నారు. సిరాజ్ వరుసగా ఐదు మ్యాచ్‌లు ఆడుతుండగా.. ఆకాశ్ దీప్ గాయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకొని జట్టులోకి వచ్చాడనే విషయాన్ని టీమిండియా మేనేజ్‌మెంట్ మరిచిపోయిందా? అని ప్రశ్నిస్తున్నారు. దురదృష్టవశాత్తు ఈ ముగ్గురు పేసర్లలో ఒక పేసర్ గాయపడితే టీమిండియా పరిస్థితి ఏందని నిలదీస్తున్నారు. గౌతం గంభీర్ ఒంటెత్తు పోకడతో టీమిండియాను నాశనం చేస్తున్నాడని మండిపడుతున్నారు. అసలు గంభీర్‌కు దిమాక్ ఉందా? అని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ తుది జట్టును చూస్తుంటే భారత్.. గెలుపు కోసం ఆడటం లేదని, డ్రా కోసమే బరిలోకి దిగినట్లు అనిపిస్తుందని అభిప్రాయపడుతున్నారు.
ఈ మ్యాచ్‌లోనూ టీమిండియా టాస్ ఓడిపోయింది. ఈ సిరీస్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లకు ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టాస్ గెలవలేదు. అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా వరుసగా 15 మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోయింది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఐదు మ్యాచ్‌ల్లో టాస్ ఓడిపోవడం 21వ శతాబ్దంలో ఇదే తొలిసారి. 2018 ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంతకుముందు 13 సిరీస్‌ల్లో మూడు సిరీస్‌లు డ్రా కాగా.. టాస్‌లు అన్నీ ఓడియపోయిన జట్టు ఒకేసారి మాత్రమే విజేతగా నిలిచింది. అది కూడా 1953లో సొంతగడ్డపై జరిగిన యాషెస్ సిరీస్‌లో ఇంగ్లండ్ గెలుపొందింది.