
ఓవల్: భారత్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్.. పిచ్ పరిస్థితుల నేపథ్యంలో బౌలింగ్ తీసుకున్నట్లు చెప్పాడు. ఇక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, సామ్ కరన్, జోస్‌బట్లర్ ప్లేస్‌లో క్రిస్ వోక్స్, ఓలీ పోప్ వచ్చారని తెలిపాడు. ఇక భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం టాస్ గెలిస్తే ఫీల్డింగ్ తీసుకునేవాడినని చెప్పాడు. ఇక జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయని, ఇషాంత్ శర్మ, మహమ్మద్ షమీ స్థానాల్లో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ వచ్చాడని చెప్పాడు. దాంతో మరోసారి రవిచంద్రన్ అశ్విన్‌కు మొండిచేయ్యే ఎదురైంది. అయితే టీమ్ సమతూకం నేపథ్యంలోనే అశ్విన్‌కు అవకాశం దక్కలేదన్నాడు.
భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ కీలక దశకు చేరుకుంది. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా... మరో టెస్టు గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది. దాంతో ఇరు జట్లు విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. లీడ్స్ టెస్టులో గెలుపుతో ఇంగ్లండ్‌లో ఆత్మవిశ్వాసం పెరగ్గా... గత మ్యాచ్ ఫలితాన్ని మరచి కొత్త ఆరంభంపై భారత్ దృష్టి పెట్టింది. అడిలైడ్‌లో 36 పరుగులకు ఆలౌట్ అయిన తర్వాత కూడా భారత జట్టు ఆస్ట్రేలియాపై సిరీస్ గెలవగలిగింది. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్టులో పరాజయం పాలైన తర్వాత కూడా మళ్లీ కోలుకొని ప్రత్యర్థిని చిత్తు చేసింది. కింద పడిన ప్రతీసారి మరింత బలంగా పైకి లేవడం భారత్‌కు కొత్త కాదు. గతంలో ఎన్నోసార్లు దీనిని చేసి చూపించిన టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై దానిని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. లార్డ్స్‌లో గెలుపు తర్వాత లీడ్స్‌లో ఓటమిని ఆహ్వానించిన కోహ్లీ సేన... గత మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి అమితోత్సాహంతో ఉన్న ఇంగ్లండ్ జట్టును ఎలా ఎదుర్కొంటుందనేది ఆసక్తికరం.
తుది జట్లు:
భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్యా రహానే, రిషభ్ పంత్(కీపర్), రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
ఇంగ్లండ్: రోరీ బర్న్స్, హసీబ్ హమీద్, డేవిడ్ మలాన్, జో రూట్ (కెప్టెన్), ఓలీ పోప్, జానీ బెయిర్‌స్టో(కీపర్), మోయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రైగ్ ఒవర్టన్, ఓలీ రాబిన్సన్, జేమ్స్ అండర్సన్.