ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. హైదరాబాద్ వేదికగా ఉత్కంఠగా సాగిన తొలి టెస్ట్‌లో విజయం దిశగా సాగిన భారత్ చివరకు ఓటమికి తల ఒంచింది. 231 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయింది. ఇంగ్లండ్ స్పిన్నర్ల ధాటికి 202 పరుగులకే కుప్పకూలింది.
నాలుగు రోజుల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో తొలి రెండు రోజులు పూర్తి ఆధిపత్యం చెలాయించి పట్టు బిగించిన భారత్.. చివరి రెండు రోజుల్లో మాత్రం పేలవ బ్యాటింగ్, చెత్త ఫీల్డింగ్‌తో తేలిపోయింది. ముఖ్యంగా నాలుగు తప్పిదాలు టీమిండియా ఓటమిని శాసించాయి.
1. చెత్త ఫీల్డింగ్..
ఈ మ్యాచ్‌లో టీమిండియా ఫీల్డింగ్ మరీ నాసిరకంగా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత ఫీల్డింగ్‌తో పాటు అసాధారణ క్యాచ్‌లు అందుకున్న టీమిండియా ఫీల్డర్లు.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం తేలిపోయారు. చేతుల్లోకి వచ్చిన క్యాచ్‌లు నేలపాలు చేయడంతో పాటు సునాయస బౌండరీలు ఆపలేకపోయారు. బంతిని ఆపడంలో తడబడి పాకిస్థాన్ ఫీల్డింగ్‌ను తలపించారు.

ఫీల్డింగ్ తప్పిదాలతో 10 బౌండరీల వరకు విడిచిపెట్టడంతో పాటు 50-60 పరుగులు అదనంగా ఇచ్చారు. ఇక ఇంగ్లండ్ మ్యాచ్ విన్నర్ ఓలిపోప్ ఇచ్చిన రెండు క్యాచ్‌లను నేలపాలు చేశారు. 116 పరుగుల వద్ద అతను ఇచ్చిన సునాయస క్యాచ్‌ను అక్షర్ పటేల్ వదిలేయగా.. 180 పరుగుల వద్ద రాహుల్ అందుకోలేకపోయాడు.
ఈ రెండు అవకాశాలతో చెలరేగిన అతను 196 పరుగులు చేశాడు. ఓలిపోప్ క్యాచ్‌ను అక్షర్ పటేల్ పట్టి ఉంటే ఈ మ్యాచ్ ఫలితం మరోలా ఉండేది. ఓ కష్టతరమైన క్యాచ్‌ను యశస్వి జైస్వాల్ కూడా వదిలేసాడు.
2. పేలవ బ్యాటింగ్
231 పరుగుల స్వల్ప లక్ష్యచేధనకు దిగిన భారత్ పేలవ బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ శుభారంభం అందించడంలో విఫలమవ్వగా.. శుభ్‌మన్ గిల్ సిల్వర్ డక్‌గా వెనుదిరిగాడు. అతని వైఫల్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో భారత బ్యాటర్లపై అనవసర ఒత్తిడి నెలకొనగా.. ఇంగ్లండ్ బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించింది.

బాధ్యతాయుతంగా ఆడాల్సిన శ్రేయస్ అయ్యర్ తీవ్రంగా నిరాశ పరచగా.. రవీంద్ర జడేజా రనౌట్ అవ్వడం టీమిండియా కొంపముంచింది. దాంతో లోయరార్డర్ పోరాడినా ఫలితం లేకపోయింది. శుభ్‌మన్ గిల్, అయ్యర్ చెరో 20 పరుగులు చేసినా ఫలితం మరోలా ఉండేది.
3. బెడిసికొట్టిన ప్రయోగం..
అక్షర్ పటేల్‌ను అప్‌ది ఆర్డర్ పంపిస్తూ టీమిండియా మేనేజ్‌మెంట్ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతను ఆచితూచి ఆడినా ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. అతని లోయరార్డ్‌లోనే ఆడించి ఉంటే.. కేఎస్ భరత్, అశ్విన్‌లతో కలిసి కీలక భాగస్వామ్యాలను నెలకొల్పేవాడు. భారత విజయానికి కృషి చేసేవాడు.

4. కొంపముంచిన దూకుడు..
టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ముగ్గురు బ్యాటర్లు శతకాలు చేజార్చుకున్నారు. టాప్-5 బ్యాటర్లు సిక్స్ లేదా ఫోర్ కొట్టబోయి ఔటయ్యారు. దూకుడుగా ఆడాలనే ఆలోచనతో పేలవ షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. దాంతో టీమిండియా 100 పరుగులు తక్కువగా చేసింది. టెస్ట్ తరహాలో బ్యాటింగ్ చేసి భారత్ మరింత ఆధిక్యాన్ని అందుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేది.