ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్ పోరాటం ముగిసింది. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌట్‌గా వెనుదిరిగాడు. సెంచరీకి చేరవైన కేఎల్ రాహుల్‌కు స్ట్రైక్ ఇవ్వాలనే ఉద్దేశంతో రిషభ్ పంత్ రిస్కీ సింగిల్ తీసి మూల్యం చెల్లించుకున్నాడు. బెన్ స్టోక్స్ స్టన్నింగ్ త్రోతో నిరాశగా పెవిలియన్ చేరాడు.
షోయబ్ బషీర్ వేసిన 66వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ తొలి బంతికి రాహుల్ సింగిల్ తీయగా.. రెండో బంతిని పంత్ డాట్ చేశాడు. మూడో బంతిని కవర్ పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్‌కు ప్రయత్నించాడు. బంతిని అందుకున్న బెన్ స్టోక్స్.. నేరుగా నాన్‌స్ట్రైకర్ వికెట్లను పడగొట్టాడు. దాంతో రిషభ్ పంత్ రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. రిషభ్ పంత్ రిస్కీ సింగిల్ తీయడాన్ని నెటిజన్లు తప్పుబడుతున్నారు. స్టుపిడ్ స్టుపిడ్ స్టుపిడ్ అని కామెంట్ చేస్తున్నారు. నిలకడగా ఆడుతున్న సమయంలో అనవసరం తప్పిదంతో ఇంగ్లండ్‌కు అవకాశం ఇచ్చారని అభిప్రాయపడుతున్నారు.

ఈ మ్యాచ్‌లో గాయంతో కీపింగ్ చేయలేకపోయినా రిషభ్ పంత్(112 బంతుల్లో 8 ఫోర్లు 2 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీతో టీమిండియాను ఆదుకున్నాడు. కేఎల్ రాహుల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 141 పరుగులు జోడించాడు. రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(98 బ్యాటింగ్) సూపర్ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ బౌలర్లను ఆడుకున్నారు. దాంతో 145/3 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ లంచ్ బ్రేక్ సమయానికి 65.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 248 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఆలౌటైంది. జోరూట్(199 బంతుల్లో 10 ఫోర్లతో 104) సెంచరీతో రాణించగా.. జెమీ స్మిత్(56 బంతుల్లో 6 ఫోర్లతో 51), బ్రైడన్ కార్స్(83 బంతుల్లో 6 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీలతో రాణించారు. బెన్ స్టోక్స్(44), ఒలీ పోప్(44) కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా(5/74) ఐదు వికెట్లు తీయగా.. మహమ్మద్ సిరాజ్(2/85), నితీష్ కుమార్ రెడ్డి(2/62) రెండేసి వికెట్లు పడగొట్టారు.