ఇంగ్లండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మూడో రోజు ఆటలో భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్లతో బరిలోకి దిగారు. టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ టెస్ట్ క్రికెటర్ దత్తాజీరావు గైక్వాడ్(95) మృతి సంతాపంగా భారత ఆటగాళ్లు బ్లాక్ రిబ్బన్లు ధరించారని బీసీసీఐ ట్వీట్ చేసింది.
దత్తాజీ రావు గైక్వాడ్ భారత్ తరఫున 11 టెస్టు మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించాడు. ఓ హాఫ్ సెంచరీతో 350 పరుగులు చేశాడు. 1952, 1959లో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టులో కీలక ఆటగాడిగా వ్యవహరించిన దత్తాజీ రావు..1952-53లో వెస్టీండీస్ పర్యటనకు కూడా వెళ్లారు.1959 ఇంగ్లండ్ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహించారు.

అయితే అనారోగ్యంతో దత్తాజీ రావు గైక్వాడ్ ఫిబ్రవరి 13న బరోడాలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయన మరణంపై ఆలస్యంగా స్పందించిన బీసీసీఐ.. బ్లాక్ రిబ్బన్లు ధరించి సంతాపం తెలియజేసింది.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే 207/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో ఓవర్‌నైట్ బ్యాటర్ జోరూట్(18) చెత్త షాట్‌తో పెవిలియన్ చేరారు. బుమ్రా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
ఆ వెంటనే క్రీజులోకి వచ్చిన బెయిర్ స్టో(0)ను కుల్దీప్ యాదవ్ స్టన్నింగ్ డెలివరీతో డకౌట్ చేశాడు. దాంతో 19 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. క్రీజులో సెంచరీ హీరో బెన్ డక్కెట్(143 బ్యాటింగ్)తో పాటు బెన్ స్టోక్స్(0) ఉన్నారు.
ఇక టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు కుప్పకూలింది. రవీంద్ర జడేజా(225 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌తో 112), రోహిత్ శర్మ(196 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్స్‌లతో 131) శతకాలతో రాణించగా.. సర్ఫరాజ్ ఖాన్(66 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 62) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు.
రవిచంద్రన్ అశ్విన్(89 బంతుల్లో 6 ఫోర్లతో 37), ధ్రువ్ జురెల్(104 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 46) కీలక ఇన్నింగ్స్ ఆడారు. జస్‌ప్రీత్ బుమ్రా(28 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 26) సైతం దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(4/114) నాలుగు వికెట్లు తీయగా.. జేమ్స్ అండర్సన్, టామ్ హార్ట్‌లీ, జోరూట్ తలో వికెట్ పడగొట్టారు. రెహ్మాన్ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి.