
లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో టీమిండియా నయావాల్ చతేశ్వర్ పుజారా రాణిస్తున్నాడు. తనపై వచ్చిన విమర్శలకు సమాధానమన్నట్లు దూకుడుగా ఆడిన చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలుస్తూ సెంచరీకి చేరువయ్యాడు. వరుస వైఫల్యాలకు చెక్ పెడుతూ అసలు సిసలు పుజారాను తలపిస్తూ చెలరేగాడు. తన శైలికి భిన్నంగా పుల్ షాట్స్ ఆడుతూ.. వేగవంతమైన స్ట్రైక్‌రేట్‌తో దూసుకెళ్లాడు. కనీసం 40 బంతులైనా ఆడకుండా సింగిల్ తీయని పుజారా.. మూడో రోజు ఆటలో మాత్రం దూకుడు కనబర్చాడు. ఐపీఎల్ సెకండాఫ్ ముంగిట చెలరేగాలనుకున్నాడో లేక వరుస వైఫల్యాలతో బ్యాటింగ్ వ్యూహం మార్చాడో తెలియదు కానీ.. నిన్న మాత్రం ఓ కొత్త పుజారా కనిపించాడు.
ఈ క్రమంలో 91 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో పుజారా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే సేనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాలపై టెస్ట్‌ల్లో పుజారాకు ఇది అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ. అంతకుముందు 2014 ఇంగ్లండ్ పర్యటనలో నాటింగ్‌హోమ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పుజారా 95 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ఇప్పటి వరకు ఇదే బెస్ట్‌గా ఉండగా.. తాజాగా దాన్ని భారత నయావాల్ సవరించాడు. 2014 ఆస్ట్రేలియా పర్యటనలో అడిలైడ్ టెస్ట్‌లో 96 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్న పుజారా.. 2013 సౌతాఫ్రికా టూర్‌లో డర్బన్ టెస్ట్‌లో 97 బంతుల్లో, 2018 ఇంగ్లండ్ టూర్ సౌతాంప్టన్ టెస్ట్‌లో 100 బంతుల్లో ఫిఫ్టీ చేశాడు. ఇవే సెనా దేశాలపై పుజారా బాదిన వేగవంతమైన హాఫ్ సెంచరీలు.
ఓవరాల్‌గా సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తన అరంగేట్ర టెస్ట్‌లో పుజారా బాదిన హాఫ్ సెంచరీ వేగవంతమైనది. ఈ మ్యాచ్‌లో 64 బంతులాడిన పుజారా 6 ఫోర్ల సాయంతో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 72 పరుగులు చేసిన పుజారా హరిట్జ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. పుజారా కీలక ఇన్నింగ్స్‌తో భారత్.. ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది.
తాజా మ్యాచ్ విషయానికి వస్తే .. ఓపెనర్ రోహిత్ శర్మ (156 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 59) రాణించగా, చతేశ్వర్ పుజారా (180 బంతుల్లో 15 ఫోర్లతో 91 బ్యాటింగ్) సెంచరీకి చేరువయ్యాడు. కెప్టెన్ కోహ్లీ (94 బంతుల్లో 6 ఫోర్లతో 45 బ్యాటింగ్) క్రీజులో పాతుకుపోయాడు. 80 ఓవర్లు అంటే దాదాపు రోజంతా (సాధారణంగా 90 ఓవర్లు) బ్యాటింగ్ చేసిన టీమిండియా కేవలం రెండే వికెట్లు సమర్పించుకుంది. మూడో రోజు ఆట నిలిచే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 215 పరుగులు చేసింది. రాబిన్సన్, ఓవర్టన్‌లకు చెరో వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో పుజారా స్ట్రైక్ రేట్ 50 ప్లస్ ఉండటం విశేషం.