ఐదు టెస్ట్‌ల అండర్సన్-సచిన్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎడ్జ్‌బాస్టన్ మైదానం వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్ తొలి రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నిలకడగా ఆడుతున్న యశస్వి జైస్వాల్.. ఏకాగ్రతను దెబ్బతీసేందుకు బెన్ స్టోక్స్ తన నోటికి పని చెప్పాడు. స్టోక్స్ స్లెడ్జింగ్‌కు యశస్వి జైస్వాల్ తనదైన శైలిలో బదులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
తొలి రోజు ఆట ఫస్ట్ సెషన్ 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్..ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ లైన్‌లో వేయగా యశస్వి జైస్వాల్ బ్యాక్‌ఫుట్ షాట్‌తో బౌండరీకి తరలించాడు. ఆ మరుసటి బంతిని స్టంప్స్‌పైకి వేయగా.. జైస్వాల్ చాకచక్యంగా ఆడి క్విక్ సింగిల్ తీసాడు. ఈ క్రమంలో స్టోక్స్ పక్క నుంచే జైస్వాల్ పరుగెత్తగా..అతను ఏదో అన్నాడు. దాంతో జైస్వాల్ 'నా మాటలు వినాలని నీకు లేదు.. కమాన్'అని బదులిచ్చాడు. ఆ వెంటనే స్టోక్స్..'అసలు నువ్వు ..ఏం వద్దంటున్నావ్ ?'అని ప్రశ్నించాడు. చివరి బంతిని స్టోక్స్ స్టంప్‌పైకి వేయగా.. కరుణ్ నాయర్ అద్భుతంగా డిఫెండ్ చేశాడు. ఈ సారి జైస్వాల్ వైపు నడిచిన స్టోక్స్.. 'నువ్వు ఏం అన్నావ్?'అని అడిగాడు. ఈ సారి జైస్వాల్ ఏ మాత్రం స్పందించలేదు. దాంతో వాగ్వాదం ముగిసింది. అయితే ఈ మాటలు స్టంప్ మైక్‌లో రికార్డ్ అయ్యాయి.

ఈ మ్యాచ్‌లో జైస్వాల్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. తొలి టెస్ట్‌లో సెంచరీ బాదిన అతను ఆ ఫామ్‌ను కొనసాగించాడు. అయితే తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. వన్డే తరహాలో దూకుడుగా బ్యాటింగ్ చేసిన యశస్వి జైస్వాల్.. 107 బంతుల్లో 13 ఫోర్లతో 87 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా వెనుదిరిగాడు. కేఎల్ రాహుల్(2) విఫలమైనా.. కరుణ్ నాయర్‌తో కలిసి జైస్వాల్ దూకుడుగా ఆడాడు. 59 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న అతను కరుణ్ నాయర్‌తో కలిసి రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించాడు. శుభ్‌మన్ గిల్‌తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం అందించాడు. దాంతో టీమిండియా 182/3 స్కోర్‌తో రెండో సెషన్‌ను ముగించింది. క్రీజులో రిషభ్ పంత్‌తో పాటు శుభ్‌మన్ గిల్ ఉన్నారు.