టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్‌లో చెత్త వ్యూహాలతో మూల్యం చెల్లించుకున్నారని మండిపడ్డాడు. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డింది. ఆకాశ్ దీప్, మహమ్మద్ సిరాజ్ అద్భుత బౌలింగ్‌తో ఇంగ్లండ్ టాపార్డర్‌ను పెవిలియన్ చేర్చారు.
ఇలాంటి పరిస్థితుల్లో మిగతా వికెట్లను త్వరగా తీసి పైచేయి సాధించాల్సిన టీమిండియా చేతులెత్తేసింది. హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ అసాధారణ బ్యాటింగ్‌తో ఇంగ్లండ్‌ను ఆదుకున్నారు. శుభ్‌మన్ గిల్, గౌతమ్ గంభీర్ చెత్త వ్యూహాలు కూడా ఈ ఇద్దరికి కలిసొచ్చాయి. ముఖ్యంగా ప్రసిధ్ కృష్ణతో టీమిండియా చేసిన షార్ట్ పిచ్ బాల్ వ్యూహం బెడిసి కొట్టింది. తొలి టెస్ట్‌లో జెమీ స్మిత్.. ప్రసిధ్ కృష్ణ షార్ట్ పిచ్ బాల్‌కు బౌండరీ లైన్‌పై థర్డ్ మ్యాన్ ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరాగాడు. మరోసారి అతన్ని అలానే ఔట్ చేయాలనే వ్యూహంతో ప్రసిధ్ కృష్ణతో టీమిండియా పదే పదే షార్ట్ పిచ్ బాల్స్ వేయించింది.

జెమీ స్మిత్ మాత్రం.. టీ20 తరహాలో ప్రసిధ్ కృష్ణపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అతని ధాటికి ప్రసిధ్ కృష్ణ ఒకే ఓవర్‌లో 23 పరుగులు సమర్పించుకున్నాడు. అతని చెత్త బౌలింగ్ కారణంగా మూమెంటమ్ ఇంగ్లండ్‌వైపు మళ్లింది. స్వేచ్చగా బ్యాటింగ్ చేసిన స్మిత్, హ్యారీ బ్రూక్ సెంచరీలు పూర్తి చేసుకోవడంతో పాటు 6వ వికెట్‌కు 303 పరుగులు జోడించారు. దాంతో ప్రసిధ్ కృష్ణతో పాటు టీమిండియా వ్యూహాలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
సోషల్ మీడియా వేదికగా టీమిండియా వ్యూహాలను మహమ్మద్ కైఫ్ తప్పుబట్టాడు. '84/5 పరిస్థితుల్లో టీమిండియా కాస్త ఓపిక చూపెట్టాల్సింది. బంతి కూడా మూవ్ అయ్యింది. భారత బౌలర్లు మంచి లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేయాల్సింది. కానీ స్మిత్, బ్రూక్‌ను ఔట్ చేసేందుకు షార్ట్ పిచ్ బంతులు వేసి మూల్యం చెల్లించుకుంది. తప్పుడు వ్యూహాలతో అవకాశాన్ని కోల్పోయింది.'అని మహమ్మద్ కైఫ్ ట్వీట్ చేశాడు.
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా సైతం టీమిండియా వ్యూహాలను తప్పు బట్టాడు. చాలా వింతగా ఉన్నాయని తెలిపాడు. 'భారత్ నుంచి విచిత్రకరమైన వ్యూహాలు. డీప్‌లో క్యాచ్ ఔట్ చేసేందుకు టీమిండియా 300 పరుగులను మూల్యంగా చెల్లించుకుంది.'అని విమర్శలు గుప్పించాడు.