ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో ఊహించని పరాజయం ఎదుర్కొన్న టీమిండియా.. రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటుంది. ఓవైపు గాయాల బెడద టీమిండియాను వేదిస్తుండగా.. మరోవైపు టీమ్ కాంబినేషన్ ఎంపిక తలనొప్పిగా మారింది. ముఖ్యంగా స్పిన్‌తో పాటు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే వైజాగ్ పిచ్‌పై ఎలాంటి వ్యూహాలు రచించాలనేది టీమిండియాకు సవాల్‌గా మారింది.
ఇప్పటికే స్టార్ ప్లేయర్ రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ గాయాలతో దూరమవ్వగా.. వ్యక్తిగత కారణాలతో కోహ్లీ అందుబాటులో లేడు. మరోవైపు శుభ్‌మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ దారుణ వైఫల్యం ఇబ్బందిగా మారింది. కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలా? లేక సీనియర్లనే కొనసాగించాలా? అనేది తేల్చుకోలేకపోతుంది. ఎక్స్‌ట్రా బ్యాటర్‌తో బరిలోకి దిగాలా? లేక ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకోవాలా? అనేది కూడా సవాల్‌గా మారింది.

స్పిన్ పిచ్‌లపై మహమ్మద్ సిరాజ్ పెద్దగా ప్రభావం చూపకపోవడంతో అతని స్థానంలో ఓ ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకోవాలని కొందరంటే.. నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని మరికొందరు సూచిస్తున్నారు. మరోవైపు ఇంగ్లండ్ కోచ్ మెక్‌కల్లమ్ నలుగురు స్పిన్నర్లతో ఆడేందుకు కూడా తాము సిద్దమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలోనే టీమిండియా టీమ్ కాంబినేషన్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
హైదరాబాద్ టెస్ట్ తరహాలోనే ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగితే జట్టులో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయి. ఓపెనర్లుగా రోహిత్, జైస్వాల్ ఆడనుండగా.. మూడో స్థానంలో శుభ్‌మన్ గిల్, నాలుగో స్థానంలో రజత్ పటీదార్ లేదా సర్ఫరాజ్ ఖాన్ ఆడే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో ఆడవచ్చు. శుభ్‌మన్ గిల్‌పై వేటు వేస్తే సర్ఫరాజ్‌తో పాటు రజత్ పటీదార్ ఇద్దరూ అరంగేట్రం చేస్తారు. ఎక్స్‌ట్రా బ్యాటర్‌ను తీసుకున్నా.. ఇద్దరికీ అవకాశం దక్కుతుంది.
బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మాటలను చూస్తే గిల్‌కు మరో అవకాశం దక్కేలా ఉంది. వైజాగ్ టెస్ట్ అతని లిట్మస్ టెస్ట్‌లా మారింది. ఈ మ్యాచ్‌లో రాణిస్తేనే జట్టులో కొనసాగనున్నాడు. వికెట్ కీపర్‌గా కేఎస్ భరత్ ఆడనుండగా.. స్పిన్ ఆల్‌రౌండర్లుగా రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ఆడనున్నారు. మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్‌లో ఒకరు బరిలోకి దిగనున్నారు.
ఎక్స్‌ట్రా స్పిన్నర్‌ను తీసుకుంటే ఈ ఇద్దరూ ఆడుతారు. పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్‌లు ఆడుతారు. ఎక్స్‌ట్రా బ్యాటర్ లేదా ఎక్స్‌ట్రా స్పిన్నర్ తీసుకుంటే సిరాజ్ బెంచ్‌కు పరిమితమవుతాడు.
భారత తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రజత్ పటీదార్/సర్ఫరాజ్ ఖాన్, శ్రేయస్ అయ్యర్, కేఎస్ భరత్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్/వాషింగ్టన్ సుందర్